Solar Eclipse 2022: సూర్య గ్రహణం వచ్చిందంటే హిందూ సాంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. ఆరోజు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతారు పెద్దలు. పూర్వకాలం నుంచి ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కొన్ని పనులు చేయకూడదని, లేకుంటే పుట్టబోయే బిడ్డలకు గ్రహణం మొర్రి వస్తుందని చెబుతారు. ఆ భయంతో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉంటారు. సూర్యగ్రహణం అనేది భూమికి మరియు సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. సైన్సు ప్రకారం చూస్తే గర్భిణులపై ప్రభావం చూపించడం, మనుషుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించడం అనేవి నిరూపణ కాలేదు. కానీ ప్రాచీన కాలం నుంచి నమ్మకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.
గర్భిణీ స్త్రీలకు అంత ప్రమాదమా?
ప్రాచీన సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారంజ.. గ్రహణాలను 'చెడు శకునాలు' లేదా 'అశుభం'గా భావిస్తారు. గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో చేసే పనులు తల్లి, పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అంటారు. అయితే ఈ నమ్మకాలకు శాస్త్రీయ రుజువు ఇంతవరకు లభించలేదు. గర్భిణులపై సూర్యకిరణాలు పడితే అది గర్భంలోని శిశువుకు ప్రమాదమని అంటారు.ఇప్పటికీ ఈ నమ్మకాలను బలంగా నమ్ముతూనే ఉన్నారు ప్రజలు. సూర్య గ్రహణ సమయంలో గర్భిణులు చేయాల్సిన పనులు, చేయకూడని పనులేంటో కొన్ని వాడుకలో ఉన్నాయి. అవి ఇవే.
చేయాల్సిన పనులు
1. గర్భిణులు గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళ్లరాదు.
2. ఆ సమయంలో నిద్రపోకూడదు, మెలకువగానే ఉండి దేవుడిని స్మరించుకోవాలి.
3. గ్రహణం ముగిసిన వెంటనే ప్రతికూల ప్రభావాలను అడ్డుకోవడానికి స్నానం చేయాలి.
4. కిరణాలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులు, కర్టెన్లు అన్నీ వేసుకోవాలి.
చేయకూడని పనులు
1. గర్భిణులు గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు.
2. కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను వాడకూడదు.
3. ముందుగా వండి పెట్టిన ఆహారాన్ని తినకూడదు. గ్రహణం విడిచాక వండిన ఆహారాన్నే తినాలి.
4. ముఖ్యంగా గ్రహణాన్ని చూసే ప్రయత్నాన్ని మానుకోవాలి.
Also read: ఇండియా - పాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వ్యక్తికి గుండెపోటు, అత్యుత్సాహం వల్ల గుండె ఆగుతుందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.