Srikalahasti Temple Open Today: తిరుపతి: సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చాయంటే దేశంలోని అన్ని ఆలయాలను మూసివేయడం అనవాయితీ. అదే సమయంలో నక్షత్రం, రాశుల అధారంగా గ్రహ దోషాలకు పరిహారం చేయించుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఇందుకు భిన్నంగా గ్రహణ సమయంలో శ్రీకాళహస్తీ వాయులింగేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఇతర ఆలయాలకు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రధాన్య వ్యత్యాసం ఇదే. 


పంచభూత లింగాల్లో ముఖ్యమైనది వాయులింగం 
పంచ భూత లింగాలుగా మహాశివుడు భూమిపై అవతరించాడని హందూ పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అందులో భాగంగా కంచీపురం, జంబుకేశ్వరం, తిరువణ్ణామలై, చిదంబరం, శ్రీకాళహస్తీ ప్రాంతాల్లో పంచభూత లింగాలకు ఆలయాలు సైతం ఉన్నాయి. అయితే వీటిలో భూ, జల, ఆకాశ, అగ్ని ప్రతీకలు ఉన్న ఆలయాలన్నింటిని సూర్య చంద్ర గ్రహణ సమయాల్లో మూసివేసి, పరిసమాప్తి అయిన తర్వాత శుద్ధి, ఆచమనం నిర్వహించడం అనవాయితి. అప్పటి వరకూ ఎవ్వరూ ఆలయాల్లోకి ప్రవేశించరు. అయితే పంచభూత లింగాల్లో ముఖ్యమైనది వాయులింగం. పంచభూతాలకు ఎలాంటి భేదాలు, మలినాలు ఉండవని పెద్దలు చెబుతుంటారు. అయితే సూర్య, చంద్ర గ్రహణ సమయాల్లో మాత్రం పంచభూత ఆలయాల్లో నాలుగింటిని మూసివేసి కేవలం వాయులింగేశ్వరుడికి మాత్రమే అభిషేకాలను నిర్వహించడం విశేషం. 


కేవలం ఈ ఆలయాలలో పూజలు 
క్షేత్ర విశిష్టత ప్రకారం ఇక్కడ వెలిసిన వాయులింగేశ్వరుడిని సాలెపురుగు, పాము, ఏగును తొలుత స్వామివారిని సేవించుకున్నాయని చెబుతారు. ఆలయంలో స్వామివారికి రూపం ఉండదు. గాలి కంటికి కనిపించదు కాబట్టి.. చుట్టూ గాలి చొరబడేందుకు కూడా వీలులేని గర్భాలయంలో వెలిగే జ్యోతులు ఎప్పడు గాలికి కదులుతుంటాయి. అలాగే పానపట్టంపై నవ గ్రహాలకు అధిపతి వాయులింగేశ్వరుడని సూచించేలా 9 మెట్లు కలిగిన ఓ కవచం ఉంటుంది. నవగ్రహాధిపతి అయిన స్వామిని రాహూకేతువులు కూడా స్పృశించలేరని ప్రతీతి. కావున సూర్య, చంద్ర గహణ సమయాల్లో దేశంలోని అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తిలోని వాయులిగేశ్వరుడితో పాటు జ్ఞాన ప్రసూనాంబికా దేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అమ్మవారి నడుముకు నాగేంద్రుడు కచవంగా ఉంటారు. కాబట్టి రాహుకేతువులు సర్పాలు కావున వారు స్వామి అమ్మవార్లను సమీపించలేరని అర్చకులు చెబుతున్నారు. 


సూర్య, చంద్ర గ్రహణ సమయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు సకల గ్రహదోషాలు తొలగి వారికి సంపూర్ణ ఫలాలు అందుతాయని విశ్వాసిస్తారని అర్చకులు చెప్పారు. గ్రహణం సమయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీకాళహస్తికి చేరుకుంటారు. ఆలయ అధికారులు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. రాహు, కేతువుల పూజలు, గ్రహ దోషాలకు పరిహారం చేయించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున శ్రీకాళహస్తికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు.

తిరుపతికి 36 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం, పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి (గాలి లింగం) ప్రసిద్ధి చెందింది, ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహు-కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ - I తరువాత చోళ రాజులు, విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు.