మనదేశంలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం అమలులో ఉంది. దాని ప్రకారం 20 వారాలకు మించకుండా ఉంటేనే గర్భాన్ని తొలగించుకోవచ్చు. ఆ వయసు దాటితే మాత్రం చట్టం ఒప్పుకోదు. కానీ కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో కోర్టు అనుమతి ఉంటే గర్భాన్ని తొలగించుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో ఒక మహిళకు 24 వారాల గర్భంతో ఉన్న సమయంలో తన బిడ్డ ఆరోగ్యపరిస్థితి గురించి తెలిసింది. దీంతో ఆమె మానసికంగా చాలా కుంగిపోయింది. కోర్టును ఆశ్రయించి తనకు అబార్షన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వమని కోరింది. కోర్టుకు ఆమె చెప్పిన కారణాలు సహేతుకంగా అనిపించి అందుకు ఒప్పుకుంది. దీన్ని కోర్టు ఒక స్త్రీ పునరుత్పత్తి హక్కుగా పేర్కొంది. అంతేకాదు అది ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ అని కూడా చెప్పుకొచ్చింది. అయితే కోర్టు తీర్పు ఇచ్చేనాటికి ఆమె గర్భం వయసు 28 వారాలు, అంటే ఏడు నెలలు.
ఎలాంటి పరిస్థితుల్లో...
కోర్టు ఓసారి ‘తల్లి జీవితం కన్నా పుట్టబోయే బిడ్డ జీవితం ఎక్కువ కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా జీవించే హక్కు ఆమెకుంది’ అని చెబుతూ 26వ వారంలో కూడా గర్భస్రావానికి అనుమతినిచ్చింది. ఇప్పుడు ఏకంగా 28 వారాల బిడ్డ. అయినా కోర్టు ఒప్పుకుంది. దానికి కారణం ఆ తల్లీబిడ్డల ఆరోగ్యపరిస్థితులు. 24 వారాల వయసులో కడుపులోని బిడ్డకు అరుదైన గుండె జబ్బు ఉన్నట్టు తేలింది. దీనివల్ల ఆ బిడ్డ పుట్టాక కూడా ఏడాది పాటూ కృత్రిమంగానే శ్వాసను అందించాల్సి ఉంటుంది. అంతేకాదు అనేక శస్త్రచికిత్సలు చేయవలసి ఉంటుంది. అయినా సరే ఆరోగ్యంగా బిడ్డ పెరుగుతుందన్న హామీ లేదు. ఈ విషయం తెలుసుకున్న తల్లి విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైంది. గర్భం ఇలాగే కొనసాగితే తల్లి మరింతగా డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉన్నట్టు వైద్యనివేదికలు తెలిపాయి. దీంతో ఆమెకు గర్భవిచ్చిత్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది కోర్టు.
చట్టం ఏం చెబుతోంది?
భారతదేశంలో మెడికల్ టెర్మినేషన్ ఆప్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ను 1971లో ప్రవేశపెట్టారు. తొలినాళ్లలో కేవలం 12 వారాల గర్భం వరకే అబార్షన్ చేయించుకునే హక్కు ఉండేది. కానీ పలు సవరణలు చేస్తూ ప్రస్తుతం 20 వారాలకు పొడిగించారు. అయితే గతేడాది ప్రత్యేక వర్గాల మహిళలకు 20 వారాల నుంచి 24 వారాలకు పెంచారు. అంటే మైనార్టీ తీరకుండానే గర్భం ధరించిన బాలికలు, అత్యాచార బాధితులు, రక్తసంబంధీకుల వల్లే లైంగిక హింసకు గురైనవారు, వికలాంగులు... వీరంతా ప్రత్యేక కేటగిరీ కిందకు వస్తారు.
ఎలా చేస్తారు?
ఇరవై ఎనిమిది వారాల బిడ్డ అంటే పూర్తిగా ఎదిగిన పిండం అనే చెప్పుకోవాలి. అందుకే కొన్ని మందుల ద్వారా నొప్పులు రప్పించేందుకు ప్రయత్నిస్తారు వైద్యులు. నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అంతకుముందే బిడ్డను గర్భంలోనే మరణించేలా చేస్తారు. నార్మల్ డెలివరీ వీలుకానప్పుడు, సి సెక్షన్ ద్వారా బిడ్డను తొలగిస్తారు. ఆ తరువాత తల్లి కొన్ని నెలల పాటూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా, శారీరకంగా ఎలాంటి నిరాశకు గురికాకుండా కుటుంబసభ్యులు చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అబర్షన్ తరువాత రక్తహీనత, ఇన్ ఫెక్షన్, గర్భాశయంలో పగుళ్లు వంటివి రావచ్చు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్స్
Also read: సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఇవి తింటే.. మీ కోరిక నెరవేరుతుంది.. హార్వర్డ్ స్డడీ
Also read: వార్నీ... ఈ యూనివర్సిటీలో తినడం, తాగడం నేర్పిస్తారట, చివరికి అది కూడా...
Also read: అంధుల పాలిట వరం బ్రెయిలీ లిపి... అసలు ఎవరీ బ్రెయిలీ? అతనెందుకు ఈ లిపిని కనిపెట్టారు?
Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా
Also read: పసుపు అధికంగా తింటే శరీరంలో ఐరన్ లోపించే అవకాశం... ఇంకా ఎన్నో సమస్యలు