ఆధునిక ప్రపంచంలో జీవితం చాలా వేగంగా సాగుతోంది. ఆ వేగాన్ని అందుకునే క్రమంలో ప్రతి ఒక్కరికీ వయసుతో నిమిత్తం లేకుండా ఒత్తిడి కూడా రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రతి వారి నుంచి వినే మాట సమయం చాలడం లేదు. ఈ సమయం చాలక పోవడం వల్ల జీవనశైలి లో విపరీతమైన మార్పులు. ఈ మార్పులు రకరకాల అనారోగ్య సమస్యలకు పరోక్షంగానూ కొన్ని సార్లు ప్రత్యక్షంగానూ కారణం అవుతున్నాయి. గుండె జబ్బులు, ఊబకాయం, కొన్ని రకాల క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల తీవ్రమైన అనారోగ్యాలకు ప్రస్తుత జీవన శైలి కారణం అవుతోంది. అలాంటి వాటిల్లో ఒకటి పెద్దపేగు క్యాన్సర్ దీనినే కోలరెక్టల్ క్యాన్సర్ అంటారు. సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ అండ్ ఫ్రివెన్షన్ (సీడీసీ) అద్యయనం ప్రకారం తీసుకునే ఆహారం, వ్యాయామం వంటి జీవనశైలి సంబంధ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్యాన్సర్ ను నివారించవచ్చు అని అంటున్నారు.


వ్యాయామం చేయాల్సిందే!


రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటి అనేది అన్ని రకాల క్యాన్సర్లను దూరం పెడుతుంది. 2021 లో మెటా ఎనాల్సిస్ ఆఫ్ సెవరల్ స్టడీస్ నుంచి వెలువడిన అధ్యయనం ఈ విషయాన్ని మరోసారి దృవీకరిస్తొంది. చేసే వ్యాయామం ఎంత క్రమం తప్పకుండా చేస్తే అంతగా పెద్ద పేగు (కోలెరెక్టల్) క్యాన్సర్ ను నివారించేందుకు అవకాశం ఉంటుంది.  కోలరెక్టల్ క్యాన్సర్ నుంచి కోలుకున్న వారిలో కూడా రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటిలో ఉన్న వారికి తిరిగి క్యాన్సర్ తిరగబెట్ట లేదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.


మిడ్ నుంచి హై ఇంటెన్సిటి కలిగిన వ్యాయామాలు చెయ్యడం వల్ల క్యాన్సర్ రిస్క్ చాలా వరకు నివారించడం వీలవుతుంది. వారంలో కనీసం మూడు సార్లయినా రోజులో అరగంట పాటు ఇంటెన్సివ్ ఎక్సర్ సైజులు చెయ్యడం అవసరం. అసలు రోజు చెయ్యగలిగితే అంతకు మించిన ఆరోగ్యం లేదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


‘‘వ్యాయామం అనగానే జిమ్ లోనే చెయ్యాలని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మీ చుట్టు పక్కల ప్రదేశాలను కాస్త ఎక్కువ దూరం అరగంట పాటు వేగంగా నడిచి వచ్చినా చాలు’’ అని అంటున్నారు బెన్ విల్కిన్సన్ అనే అంకాలజిస్ట్. ఇప్పటి వరకు మీరు వ్యాయామం చెయ్యడం మొదలు పెట్టి ఉండక పోయినా చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని ప్రతి రోజు కొంత సమయం వ్యాయామానికి కేటాయిస్తే త్వరలోనే వ్యాయామం జీవితంలో భాగం అవుతుంది.


డైట్ చాలా ఇంపార్టెంట్


ఏదో ఆకలి తీరేందుకు తినెయ్యడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా ఏది పడితే అది తిని కొలరెక్టల్ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్టు అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. మొత్తం కోలరెక్టల్ క్యాన్సర్లలో 30 నుంచి 40 శాతం ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్లేనట. కోలరెక్టల్ క్యాన్సర్ ను నివారించడంలో డైటరీ ఫైబర్ ది మొదటి స్థానం. మరే న్యూట్రియెంట్ ఇంత సమర్థంగా పనిచెయ్యదంటే అతిశయోక్తి కాదు. డైటరీ ఫైబర్ క్రమం తప్పకుండా భోజనంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. అంతేకాదు కోలరెక్టల్ క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది.


భోజనంలో ఫైబర్ పుష్కలంగా ఉండాలంటే వీలైనంత శాకాహారం చేర్చుకోవాలి, మాంసాహారం తగ్గించుకోవాలి. మాంసాహారం కంటే శాకాహారం ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్ ముప్పు చాలా వరకు తగ్గడాన్ని గమనించినట్టు అధ్యయనాల సారాంశం. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజధాన్యాలు, లెగ్యూమ్స్ లో  డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండడం ఇందుకు కారణం.


అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ వారు రోజువారీ ఆహారంలో కనీసం 30 గ్రాముల ఫైబర్ తప్పని సరిగా ఉండాలని అంటున్నారు. కోలన్, రెక్టల్ క్యాన్సర్ల నివారించేందుకు ఆహారంలో చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, సాచూరేటెడ్ ఫ్యాట్స్ ను తగ్గించుకొని డైటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడితే మంచిదట. బ్రకోలీ, కాలే అనే క్యాబేజి జాతి కూరగాయల వంటి ఆకుకూరల్లో ఉండే ప్రత్యేకమైన ఫైటోకెమికల్స్ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల వేగాన్ని తగ్గిస్తాయి.


ఇక జీవన శైలి..


పార్టీ కల్చర్ సర్వత్రా పెరిగి పోయిన తర్వాత లింగ వయో బేధాలు పెద్దగా పట్టించుకోకుండా సమాజంలో ఎక్కువ మంది ఆల్కహాల్ తీసుకోవడం, పొగతాగడం సాధారణమైపోయింది. కానీ ఈ అలవాట్లు క్యాన్సర్ కు నేరుగా కారణం కావచ్చు. ఈ అలవాట్లు ఉన్నవారిలో 59 శాతం మందికి కోలరెక్టల్ క్యాన్సర్ రిస్క్ ఉన్నట్టు అధ్యయనాల ఉవాచ. కేవలం ఆల్కహాల్ మాత్రమే తీసుకునే వారిలో 30 శాతం వరకు కొలరెక్టల్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందట.


పొగతాగడం వల్ల కేవలం లంగ్ క్యాన్సర్ మాత్రమే అనుకుంటే పొరపాటే, ఆల్కహాల్ లివర్ కు మాత్రమే హాని చేస్తుందనుకుంటే అవగాహన లేనట్టే, ఈ రెండు అలవాట్లు కోలన్ క్యాన్సర్ మాత్రమే కాదు శరీరంలోని అనేక ముఖ్య అవయవాలను దెబ్బతిస్తాయని అంటున్నారు విల్కిన్ సన్.


శారీరక బరువు


ఆరోగ్యవంతమైన శరీర బరువు మేయిన్ టెయిన్ చెయ్యడం వల్ల అనేక రకాల జబ్బుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ పౌండేషన్ చెప్పిన దాన్ని బట్టి శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కోలన్, రెక్టల్ క్యాన్సర్లకు నేరుగా కారణం అవుతోంది. స్థూలకాయాన్ని ఇప్పుడు గ్లోబల్ హెల్త్ బర్డెన్ గా పరిగణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే మరణాలలో 20శాతం మరణాలు ఒబెసిటీ కారణంగానే అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో అధిక బరువు వల్ల వచ్చే కోలన్ క్యాన్సర్ రిస్క్ ముఖ్యమైంది. ‘‘అధిక బరువును అదుపులో పెట్టేందుకు వెంటనే చర్యలు ప్రారంభించాలి. చిన్న చిన్న లక్ష్యాలతో మొదలు పెట్టి వారంవారం కొద్దికొద్దిగా బరువు తగ్గుతూ రావచ్చు. ఈ ప్రయాణంలో మీకు తోడుగా మీ ఆత్మీయులను ఒకరిని ఉంచుకోండి. అందువల్ల ఉత్సాహంగా ఉంటారు. రిజల్ట్ కనిపించే కొద్దీ ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది’’ అని టిప్స్ ఇస్తున్నారు డాక్టర్ విల్కిన్ సన్. ఇలా చిన్న మార్పులతో కోలరెక్టల్ క్యాన్సర్ ను దూరంగా తరిమెయ్యడం సాధ్యమే. జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా గడపడమూ సాధ్యమే.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!


Also Read: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు