ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అంచనాలు తారుమారయ్యేలా చేసింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు కార్టూన్ మూవీని తలపించాయి.అలాగే వానర సేనను కూడా అభ్యంతరకరంగా చూపించారని, VFX సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయని ట్రోల్ చేశారు. 


ఇప్పటికే ఈ టీజర్ పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లను దెబ్బతీసేలా 'ఆదిపురుష్' మూవీ సీన్స్ ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి మాళవికా అవినాష్ తెలిపారు. మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా సైతం 'ఆదిపురుష్' టీజర్ చూసి మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా చిత్రీకరణ ఉందని, అభ్యంతరకర సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 


తాజాగా 'ఆదిపురుష్' టీజర్ కి సంబంధించిన కోర్టుని ఆశ్రయించారు ఓ న్యాయవాది. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా టీజర్ లో సన్నివేశాలు ఉన్నాయని ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లోని బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలుపుతుండగా.. ఇప్పుడు ఈ సినిమాలో నటీనటులపై, దర్శకుడుపై చర్యలు తీసుకోవాలని ప్రమోద్ పాండే అనే లాయర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజర్ లో హనుమంతుడిని తోలు దుస్తుల్లో చూపించడంతో పాటు.. రాముడిని నెగెటివ్ గా చూపించారని పిటిషన్ లో పేర్కొన్నారు. 


ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతిసనన్, ఓం రౌత్, భూషణ్ కుమార్ లపై కేసు నమోదు చేయాలని కోర్టుకి విన్నవించారు. దీనిపై లక్నో పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినా.. ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకి తెలిపారు. మరి ఈ కేసుపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 
 
వెండితెరపై చూడాలి: 
'ఆదిపురుష్' టీజర్‌పై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ మీద చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. ''బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియ‌న్స్‌ కోసం సినిమా తీశాం. ప్రేక్షకుల ఆనందం కోసం సినిమా టీజర్ యూట్యూబ్‌లో విడుదల చేశాం. మొబైల్ ఫోనులో టీజర్ చూస్తే కొంత భిన్నంగా ఉంటుంది. మీమ్స్, ట్రోల్స్ నన్ను స‌ర్‌ప్రైజ్‌ చేయలేదు. అయితే... తొలుత ఆ విమర్శలు చూసి కొంత ధైర్యం కోల్పోయిన మాట వాస్తవమే. మా చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్‌కు యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రపంచంలో అతి పెద్ద యూట్యూబ్ ఛానల్ అది. దాని కోసం మేం సినిమా తీయలేదు. థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు మాత్రమే కాదు... మారుమూల గ్రామాల ప్రజలను సైతం థియేటర్లకు రప్పించడానికి సినిమా తీశాం'' అని ఓం రౌత్ పేర్కొన్నారు.   


'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు.  సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది. 


Also Read : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?


Also Read : వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!