బాస్‌పై కోపాన్ని చూపించేందుకు చాలా మార్గాలున్నాయి. కానీ, అన్నం పెట్టే ఆఫీసునే నాశనం చేసేస్తే ఎలా? ఇదిగో ఈ ఉద్యోగిని అదే చేసింది. బాస్ మీద కోపంతో ఏకంగా తాను పనిచేస్తున్న వేర్ హౌస్‌నే కాల్చేసింది. చివరికి ఊచలు లెక్కిస్తోంది. 


థాయ్‌లాండ్‌లోని నఖోన్ ఫాతోమ్ ప్రావీన్స్‌లోని ప్రాపాకార్న్ ఆయిల్ వేర్‌హౌస్‌లో అన్న్ శ్రియా అనే 38 ఏళ్ల మహిళ పనిచేస్తోంది. అయితే, ఇటీవల ఆమె తన బాస్‌తో గొడవపడింది. కోపంతో రగిలిపోయిన ఆమె.. చిన్న పేపరుకు నిప్పంటించి.. ఆయిల్ కంటైనర్లపైకి విసిరింది. వెంటనే మంటలు వ్యాపించి.. వేర్‌హౌస్ మొత్తం పేలిపోయింది. లక్కీగా అందులోని ఉద్యోగులు ప్రమాదాన్ని గుర్తించి బయటకు పరుగులు తీశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా జరిగేది. 


ఈ ఘటన తర్వాత సీసీటీవీ వీడియోలు పరిశీలించిన పోలీసులు.. వెంటనే శ్రియాను అదుపులోకి తీసుకున్నారు. ఆ వేర్‌హౌస్‌కు హెడ్‌గా ఉన్న శ్రియా.. ఓ చిన్న కాగితాన్ని మండించి.. ఆయిల్ కంటైనర్ల పైకి విసరడం అందులో స్పష్టంగా కనిపించింది. తన బాస్ పిపట్ ఉంగ్‌ప్రాపకార్న్ వల్ల తాను తీవ్ర ఒత్తిడి గురయ్యానని, ఆ కోపంతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని ఆమె పోలీసులకు చెప్పింది. ఈ ఘటనలో వేల గ్యాలన్ల ఆయిల్ కంటైనర్లు ధ్వంసమయ్యాయి. నిప్పు రవ్వలు ఆకాశాన్ని తాకాయి. నల్లని మేఘాల్లా కమ్మేసుకున్న పొగలు చుట్టుపక్కల ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. ఆ మంటలను అదుపు చేసేందుకు 40 ఫైర్ ఇంజిన్లు రాత్రిపగలు శ్రమించాల్సి వచ్చింది. ఆమె దుశ్చర్య వల్ల ఆ సంస్థకు రూ.9.07 కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. బాస్ మీద కోపం ఉండవచ్చు.. కానీ, మరీ ఈ స్థాయిలో రివేంజ్ తీర్చుకోవాలా అని నెటిజనులు అంటున్నారు. 


స్థానిక మేజర్ జనరల్ కోమ్చావిన్ పుర్తానానోన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఆ మహిళ ఆ సంస్థలో సుమారు తొమ్మిదేళ్లుగా పనిచేస్తోంది. తన బాస్ రోజూ తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నాడని ఆమె తెలిపింది. అతడికి నష్టం చేయాలని అనుకుంది. కానీ, ఈ స్థాయిలో విధ్వంసం జరుగుతుందని ఊహించలేదని ఆమె చెబుతోంది’’ అని తెలిపారు. 



Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..



Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క


Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి