ఒకప్పుడు పాఠాలంటే.. పూరి గుడిసెలోనే జరిగేవి.. నేల మీదే కూర్చొని పాఠాలు విని గొప్పగొప్పొళ్లు అయిన వాళ్లు ఎందరో ఉన్నారు. మాస్టారు సైకిల్ మీద వస్తున్నాడంటే.. గల్లి గల్లి అంతా... సైలెంట్ అయిపోయేది. గురువు అంటే ఊళ్లో ఎనలేని గౌరవం. పిల్లల భవిష్యత్ కూ వాళ్లు వేసే పునాదే ముఖ్యం. అమ్మా..నాన్న... జీవితాన్ని తీర్చిదిద్దే గురువు అంటే ఎంతో గౌరవం. ఒకే గురువు అన్ని సబ్జెక్టుల పాఠాలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి.


ఒకవేళ ఊళ్లో గురువుకు రావడానికి ఇబ్బందులు ఉంటే.. ఊళ్లో ఎవరైనా.. ఒకరు.. ఎద్దుల బండిలో తీసుకొచ్చి పిల్లలకు పాఠాలు చెప్పించేవారు. ఇక పిల్లలకైతే.. మాస్టారు వస్తున్నాడంటే.. కాళ్లలో భయం పట్టుకునేది. గురువు గట్టిగా ఒక్కమాట అంటే చాలు భయంతో ఏడ్చిన విద్యార్థులు ఎందరో.. పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని తెలిపాయి. గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ అందుకే తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకి భారతీయ సమాజం కల్పించింది.


మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును పురస్కరించుకుని.. టీచర్స్ డే జరుపుకుంటామని తెలిసిందే. అయితే అప్పట్లో గురువులు ఎలా ఉండేవారని రాధాకృష్ణన్ జీవితంలో జరిగిన ఓ ఉదాహరణ చూడండి.  సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు తల్లితండ్రులు ఉపనయనం చేశారు. ఇందులో భాగంగా ఆయన చెవులకు పోగులు పెట్టారు. ఇది జరిగిన అనంతరం తను చదువుకునే ఊరికి తిరిగి నడిచి వస్తున్నారు. పరీక్షకి రుసుం చెల్లించటానికి అదే చివరి రోజు. అలా వస్తున్న రాధాకృష్ణన్ ఒక దొంగ అడ్డగించి, దాడిచేసి చెవి పోగులు లాక్కున్నాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో హడలిపోయిన సర్వేపల్లికి ఒళ్ళునొప్పులు, జ్వరం వచ్చింది. దీంతో పరీక్ష ఫీజు విషయం మర్చిపోయి పాఠశాలకు కూడా వెళ్ళకుండా నిద్రపోయారు. ఇదే సమయంలో పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని ప్రధానోపాధ్యాయుడు పరిశీలించారు.


అందులో రాధాకృష్ణన్ పేరు చూసి.. బాగా చదువుకునే విద్యార్థి ఈరోజు రాకపోవడమేంటి? అని పరీక్ష రుసుం ఆయనే చెల్లించారు. ఆ తరువాత రాధాకృష్ణన్ పరీక్షల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఉపాధ్యాయుడంటే ఎలా ఉండాలో చూసిన రాధాకృష్ణన్ ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేదు. అందుకే ఒక ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలరో తెలుసుకుని, ఆచరించిన మహా పురుషుడు.


అయితే ప్రస్తుతం రోజులు మారాయి. పూరి గుడిసెలో పాఠాలు చెప్పిన రోజుల నుంచి నెట్టింట్లో ఆన్ లైన్ క్లాసులు చెప్పేదాకా వచ్చేశారు గురువులు. టెక్నాలజీ పెరిగింది. పరిస్థితులు మారాయి. పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేదు. సైకిల్ నుంచి వీడియో కాల్ లో పాఠాలు చెప్పేదాకా మారిపోయారు టీచర్స్. కరోనాతో మరింతగా మార్పులు వచ్చాయి. బయటకు అడుగుపెట్టేది లేదు. అయినా ఆన్ లైన్ తరగతుల్లో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు చాలామంది గురువులు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అప్ డేట్ అయ్యారు. కరోనా కారణంగా విద్యార్థులకు అవసరమైన నోట్స్ ని తయారు చేసి.. పంపిస్తున్నారు. కాలమేదైనా.. గురువు.. గురువే.. విద్యార్థి భవిష్యత్తే.. తన కష్ట ఫలితం.


Also Read: Corona Effect: కరోనా కారణంగా ఏపీలో గురుపూజోత్సవాలు రద్దు.. కొత్తగా నమోదైన కేసులు 1,502