పదిరూపాయలకు కనీసం రెండు ఇడ్లీ కూడా రాని పరిస్థితి. చివరికి టీ కూడా రావడం లేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం పదిరూపాయలకే ప్లేటు బిర్యానీ ఇస్తున్నాడు. అతని బిర్యానీ కోసం రోజూ వందల మంది అతని షాపుకు వస్తారు. ఈ షాపు హైదరాబాద్‌లోని అఫ్టల్ గంజ్ బస్టాండ్ ప్రాంతంలో ఉంది. దీని యజమాని ఇఫ్తెకార్. ఈ పెద్దాయన అక్కడ చాలా ఫేమస్. బిర్యానీలు ప్లేట్లలో పెడుతూ చాలా బిజీగా కనిపిస్తాడాయన. ఒక పక్క పార్సిళ్లు కూడా రెడీ అవుతుంటాయి. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవాళ్లు, బస్సుల కోసం వేచి చూసే వాళ్లు,భిక్షగాళ్లు, దారిన పోయే వారు, ఆకలేసే ప్రతి వారు ఇస్తెకార్ షాపు ముందు ఆగుతారు. ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే పేదలకు ఈ బిర్యానీ బండి ఎంతో సహకరిస్తుంది. బేగం బజార్లో పనిచేసే కూలీలకు కూడా ఇదే ఫుడ్ పాయింట్.
రోజుకి 60 కిలోలు...
ప్లేటు బిర్యాని పది రూపాయలకు అమ్ముతున్న ఇఫ్తెకార్ రోజుకు 60 కిలోల బిర్యానీని వండుతారు. దాదాపు నాలుగు పెద్ద కంటైనర్లలో వాటిని తెచ్చిపెడతారు. ఇది పూర్తిగా వెజ్ బిర్యానీ. మొక్కుబడిగా వండుతాడనుకోకండి ఇందులో క్యారెట్లు, గ్రీన్ పీస్, బంగాళాదుంపలు, బీన్స్ వంటి కూరగాయలు నిండుగా వేసి వండుతాడు. ఇఫ్తెకార్తో పాటూ అతని అన్నదమ్ములు కూడా ఇదే పనిలో ఉన్నారు. అందరూ కలిసే పదిరూపాయల బిర్యానీ షాపును నడుపుతున్నారు. ఈ బిర్యానీ షాపుకు ‘అక్సా బిర్యాని స్టాల్’ అని పేరు పెట్టారు. ఉదయం పదకొండు గంటల నుంచి ఈ బిర్యానీ అందుబాటులో ఉంటుంది.
కిలో రూ.60
ప్లేటు బిర్యాని పదిరూపాయలకు అమ్మిన ఇస్తెకార్, కిలో బిర్యాని రూ.60 కు అమ్ముతాడు. చాలా మంది కిలో బిర్యానీ పార్శిల్ కట్టించుకుని వెళతారు. రోజుకు 1500 ప్లేట్లు ఇక్కడ అమ్ముడవుతాయి. ఇఫ్తేకర్ సోదరుడు అసద్ మాట్లాడుతూ ‘తన సోదరుడు ఈ ఏరియాలో తక్కువ ధరకు ఆహారం దొరకరకపోవడాన్ని గుర్తించారు. ఇక్కడ ఉండేదంతా పేదలు, మధ్య తరగతి వారే. వారికి సేవ చేయాలన్న కోణంలో ఈ స్టాల్ ప్రారంభించారు’ అని చెప్పారు.
సేవాకార్యక్రమాలు చేయాలనుకునేవారు కూడా ఇఫ్తెకార్ కుటుంబానికి బిర్యానీ చేసి పంచి పెట్టమని ఆర్డర్ ఇస్తారు. అందుకు తగ్గిన మొత్తాన్ని వారికి చెల్లిస్తారు.
Also read: వంటసోడా కేవలం పకోడీలు, కేకుల్లో వేయడానికే కాదు, వీటితో ఇంకా ఎన్నో ఉపయోగాలు
Also read: మగవారు తండ్రిగా మారేందుకు ఉత్తమ వయసు ఇదే, సమర్థిస్తున్న వైద్య నిపుణులు