చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే పిల్లల్ని కనాలనుకున్నప్పుడు తండ్రి వయసుతో పెద్దగా పట్టింపు లేదని, తల్లి వయసు మాత్రం తక్కువ ఉండాలని భావిస్తారు. కానీ ఇది పూర్తిగా అబద్ధం. బిడ్డను కనాలనుకుంటే తల్లి వయసుతో పాటూ, తండ్రి వయసు కూడా ముఖ్యమే. మగవారిలో వయసును బట్టే వీర్య కణాల నాణ్యత ఆధారపడి ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వాటి నాణ్యత, సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి మగవారు కూడా సరైన వయసులో పిల్లల్ని కనాల్సిన అవసరం ఉంది. దీనిపై వైద్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. మగవారు ఏ వయసులోపు పిల్లల్ని కంటే పూర్తి ఆరోగ్యవంతమైన బిడ్డలు పుడతారో సిఫారసు చేశారు.
ఈ వయసులోపు...
ఇప్పటికీ పురుషులు 50 దాటాకా కూడా పిల్లల్ని కనడం చాలా సర్వసాధారణం అయిపోయింది. అంతెందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రకారం ఒక బిడ్డకు తండ్రి అయిన అతి పెద్ద వయసు వ్యక్తికి 92 ఏళ్లు. పురుషులు తాము ఏ వయసులోనైనా పిల్లల్ని కనగలమనే ధీమాను వ్యక్తం చేస్తారు. నిజమే స్త్రీల లాగా వారిలో పునరుత్పత్తి వ్యవస్థ ఒక వయసుకు వచ్చాక ఆగిపోదు. స్త్రీలలో అండాలు విడుదల మెనోపాజ్ తరువాత ఆగిపోతుంది. కానీ మగవారిలో వీర్య కణాలు బతికున్నంత కాలం తయారవుతూనే ఉంటాయి. కానీ వాటి నాణ్యత మాత్రం అంత బాగోదు. అందుకే వైద్య నిపుణులు అతిగా ఆలస్యం చేయకుండా పాతికేళ్లు దాటిన నుంచి 30 ఏళ్ల కల్లా పిల్లల్ని కనమని సిఫారసు చేస్తున్నారు. అలాగే 30 ప్రారంభంలో కూడా అంటే 31,32, ఏళ్లకు కూడా స్పెర్మ్ కౌంట్, వాటి నాణ్యత చక్కగానే ఉంటుంది. కాబట్టి ఆ వయసులో పిల్లల్ని కనేయాలి.
లేటుగా కంటే ఏమవుతుంది?
వయసు పెరుగుతున్న కొద్దీ స్పెర్మ్ లోని జన్యువులు మ్యుటేషన్ కు లోనవుతాయి. దీని వల్ల వీర్యకణంలో ఉండే DNA దెబ్బతినే అవకాశం ఎక్కువ. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు పుట్టే పిల్లలపై చాలా ప్రభావం చూపిస్తుంది. అంటే పిల్లలు ఆరోగ్యసమస్యలతో పుట్టే అవకాశం ఎక్కువ. అధ్యయనాల ప్రకారం ఇలాంటి పిల్లలు నరాల సమస్యలతో పుట్టవచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
స్పెర్మ్ ఆరోగ్యం అనేది సంతానోత్పత్తి అవకాశాలను ప్రభావితం చేస్తుంది. మిల్లీలీటర్ స్పెర్మ్ లో దాదాపు 15 మిలియన్ కణాలు ఉంటేనే సంతానోత్ప్తతి సాధ్యం అవుతుంది. అలాగే వాటి కదలిక కూడా చాలా ముఖ్యం.
ఆ వయసులోపు కనకూడదు...
జర్నల్ ఆఫ్ ఎసిడెమియాలజీ కమ్యూనిటీ హెల్త్ లో ప్రచురించిన ప్రకారం ఒక పరిశోధనలో పాతికేళ్ల లోపు తండ్రి అయితే వారిలో ఆరోగ్యసమస్యలు వస్తాయని, మధ్య వయసు వచ్చాక అకాల మరణం కూడా సంభవించవచ్చని చెప్పారు. అలాగే 30 నుంచి 44 ఏళ్ల మధ్య పిల్లల్ని కన్న తండ్రుల్లో కూడా ఆరోగ్యం సరిగా ఉండదని, చిన్న వయసులో మరణించే అవకాశం పెరుగుతుందని మరో అధ్యయనం తేల్చింది.స్పెర్మ్ నాణ్యతను దెబ్బతిసే ఎన్నో కారకాలు ఉన్నాయి. చెడు జీవనశైలి కారణంగా ఇవన్నీ అలవాటయ్యాయి. జంక్ ఫుడ్ అధికంగా తినడం, ధూమపానం, మద్యం సేవించడం, ఊబకాయం వంటివి వీర్య కణాల నాణ్యతను, సంఖ్యను తగ్గిస్తున్నాయి. కాబట్టి తండ్రి కావాలనుకునేవారు వీలైనంత వరకు 30 ఏళ్ల లోపే పిల్లల్ని కనడం ఉత్తమం.
Also read: ‘ఫాదర్స్ డే’ రోజున మీ నాన్నకు తెలుగులో ఇలా శుభాకాంక్షలు చెప్పండి