వెబ్ సిరీస్ రివ్యూ: సుడల్ 
రేటింగ్: 2.5/5
నటీనటులు: ఐశ్వర్యా రాజేష్, గోపిక రమేష్, కథిర్, ఆర్. పార్తీబన్, శ్రియా రెడ్డి,  ఫెడ్రిక్ జాన్, హరీష్ ఉత్తమన్, నివేదితా సతీష్, ప్రేమ్ కుమార్, నితీష్ వీర తదితరులు
సినిమాటోగ్రఫీ: ముఖేష్
సంగీతం: శ్యామ్ సిఎస్ 
నిర్మాణం: వాల్ వాచర్ ఫిలిమ్స్ 
దర్శకత్వం: బ్రహ్మ జి - అనుచరణ్ మురుగేయాన్
రచన: పుష్కర్ - గాయత్రి
విడుదల తేదీ: జూన్ 17, 2022
ఎన్ని ఎపిసోడ్స్: 8 (సుమారు ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమిషాలు)
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో 


ఐశ్వర్యా రాజేష్, శ్రియా రెడ్డి, పార్తీబన్, కథిర్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'సుడల్'. 'విక్రమ్ వేద' దర్శకులైన పుష్కర్ - గాయత్రి దంపతులు రైటర్స్ & షో క్రియేటర్స్. తమిళంలో తెరకెక్కించినప్పటికీ... తెలుగుతో పాటు పలు భాషల్లో అనువదించారు. (Suzhal The Vortex Telugu Web Series) ఈ సిరీస్ ఎలా ఉంది?


కథ (Suzhal Web Series Story): సాంబాలురులోని సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు, యాజమాన్యం మధ్య గొడవలు జరుగుతున్నాయి. సమ్మె మొదలైంది. కార్మికులకు షణ్ముగం (పార్తీబన్) నాయకత్వం వహిస్తున్నారు. ఫ్యాక్టరీ ఎండీ త్రిలోక్ (హరీష్ ఉత్తమన్) దగ్గర డబ్బులు తీసుకున్న సీఐ రెజీనా (శ్రియా రెడ్డి) ఎలాగైనా ఎండీకి అనుకూలంగా... షణ్ముగం, అతని అనుచరుల గొడవలు అరికట్టాలని ప్రయత్నిస్తుంది. అనుకోకుండా సమ్మె జరిగిన రోజు రాత్రి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. మొత్తం బూడిద అవుతుంది. షణ్ముగంపై త్రిలోక్, రెజీనా  అనుమానం వ్యక్తం చేస్తారు. అతడిని అరెస్టు చేయాలని వెళ్లిన రెజీనాకు షణ్ముగం చిన్న కుమార్తె నీలా (గోపికా రమేష్) కనిపించక ఆందోళనలో ఉన్న విషయం తెలిసి వెనక్కి వస్తుంది.


షణ్ముగం కుమార్తె మిస్సింగ్ కేసు ఆ తర్వాత మర్డర్ కేసుగా మారుతుంది. ఊరిలోని ఒక చెరువులో నీలాతో పాటు రెజీనా కుమారుడు అతిశయం (ఫెడ్రిక్ జాన్) డెడ్ బాడీ కూడా ఉంటుంది. ఊళ్ళో ఆంకాళమ్మ వారి జాతర మయాన్ కొళ్ళాయ్ జరుగుతున్న సమయంలో ఘటన జరుగుతుంది. పదిహేనేళ్ల క్రితం ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడు ఒక అమ్మాయి కనిపించకుండా పోవడం వెనుక, ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మరో అమ్మాయి హత్యోదంతం వెనుక ఏమైనా సంబంధం ఉందా? లేదంటే మయాన్ కొళ్ళాయ్‌లో ఎవరైనా నరబలి ఇచ్చారా? త్రిలోక్ ఏమైనా చేశాడా? కేసు దర్యాప్తులో ఎస్సై చక్రి అలియాస్ చక్రవర్తి (కథిర్), నీలా అక్క నందిని (ఐశ్వర్యా రాజేష్) తెలుసుకున్న నిజం ఏమిటి? హత్య చేసింది ఎవరు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ: కథ కొంచెం లెంగ్తీగా ఉంది కదూ... సిరీస్ కూడా అంతే! ప్రతి ఎపిసోడ్ నిడివి ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి - చెడు మనం చూసే దృష్టి కోణం బట్టి ఉంటుందనే పాయింట్‌తో రూపొందిన వెబ్ సిరీస్ 'సుడల్'. కిడ్నాప్ కేసుగా మొదలైన ఒక అమ్మాయి అపహరణ ఎన్ని సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది? చివరకు, నిజాలు ఎలా వెలుగులోకి వచ్చాయి? అనేది స్క్రీన్ ప్లే మేజిక్. ఇక, సిరీస్ విషయానికి వస్తే... 


వెబ్ సిరీస్ ఎలా ఉంది? (Suzhal Review): 'సుడల్' సిరీస్‌కు 'The Vortex' అనేది కాప్షన్. 'Vortex' అంటే సుడిగుండం. సుడిగుండం లోతు ఎంతో చెప్పడం కష్టం. అలాగే, సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు కథలో లోతు ఎంతో కొలవడం కష్టమే. అయితే... కథనం ఊహించడం ఏమంత కష్టం కాదు. ప్రతి ఎపిసోడ్ ఒక ట్విస్టుతో ముగుస్తుంది. అయితే, ముందు నుంచి క్లూస్ ఇస్తుండటంతో ట్విస్టులు ఈజీగా ఊహించవచ్చు. అందువల్ల, 'సుడుల్' చూసేటప్పుడు థ్రిల్లింత పెట్టే అంశాలు ఏవీ ఉండవు.


థ్రిల్ కంటే ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. తల్లిదండ్రులు మధ్య కలహాలు పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతాయి? లైంగిక వేధింపులకు గురైన చిన్నారుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? వంటి అంశాలతో పాటు మూఢ నమ్మకాలు, ఆచారాలనూ 'సుడల్'లో చూపించారు. అయితే... కథను ఎక్కువ సేపు కొనసాగించడం కోసం దర్శక - రచయితలు కొన్ని ఎత్తుగడలు వేశారని ప్రేక్షకుడికి అర్థమవుతూ ఉంటుంది. థ్రిల్లర్స్‌లో ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే... ప్రేక్షకుడి ఊహలకు, అంచనాలకు అందనంత దూరంలో కథ, కథనం ఉండాలి.  మెదడుకు పని చెప్పేలా ఉండాలి. ఈ రెండిటి విషయంలో 'సుడల్' ఫెయిల్ అయ్యింది. దీనికి తోడు నిడివి ఎక్కువ కావడంతో బోరింగ్ మూమెంట్స్ వచ్చి చేరాయి. మిస్ అయిన అమ్మాయి పిన్ని, టీచర్ మధ్య ట్రాక్ నిడివి పెంచింది తప్ప కథకు ఉపయోగపడలేదు. త్రిలోక్ గురించి నిజం తెలిసే సన్నివేశం చప్పగా సాగింది. అటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి. ప్రతి పాత్రకు న్యాయం చేయాలనే దర్శక - రచయితల తపనతో నిడివి పెరిగింది.


కథ, కథనం, నిడివి వంటి విషయాలను పక్కన పెడితే... మయాన్ కొళ్ళాసీన్స్‌ను తెరకెక్కించిన విధానం, తమిళ నేటివిటీని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. కొంత సేపటి తర్వాత మయాన్ కొళ్ళాయ్ సన్నివేశాలు రిపీట్ చేసినట్లు ఉంటాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. సామ్ సిఎస్ నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే, పాటల్ని తమిళంలో కాకుండా తెలుగులో వినిపించి ఉంటే బావుండేది. తెలుగు డబ్బింగ్ విషయంలో శ్రద్ధ వహించలేదు. తమిళనాడులో జరుగుతున్న కథగా చూపించినప్పుడు... అన్ని పాత్రలు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు... ఒక్క ఫైర్ ఆఫీసర్ తెలుగుకు తమిళ యాస ఎందుకు యాడ్ చేశారో?


నటీనటులు ఎలా చేశారు?: ఐశ్వర్యా రాజేష్ మంచి నటి. పాత్రకు అనుగుణంగా నటించారు. ముఖ్యంగా చివరి ఎపిసోడ్‌లో ఐశ్వర్య నటన కంటతడి పెట్టిస్తుంది. కథిర్ పాత్రకు కథలో ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆయన పాత్ర సాధారణంగా ప్రారంభమైనప్పటికీ... కథతో పాటు ప్రేక్షకుడు ప్రయాణించేలా చేయడంలో కథిర్ నటన ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇద్దరమ్మాయిలకు తండ్రిగా పార్తీబన్ నటన హుందాగా ఉంది. విశాల్ 'పొగరు'లో నెగెటివ్ రోల్ చేసిన శ్రియా రెడ్డి... చాలా ఏళ్ళ విరామం తర్వాత 'సుడల్' వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తొలుత రెండు మూడు ఎపిసోడ్స్‌లో పాత్రకు అవసరమైన పొగరు చూపించిన శ్రియా రెడ్డి... ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్క్‌లో మార్పులు చోటు చేసుకోవడంతో అందుకు తగ్గట్టు నటనలోనూ వైవిధ్యం చూపించారు. వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఐశ్వర్యా రాజేష్ చెల్లెలు నీలా పాత్రలో నటించిన గోపిక రమేష్ నటన ఆ పాత్రకు కొత్తదనం తీసుకొచ్చింది. హరీష్ ఉత్తమన్ తన ఉనికి చాటుకుంటారు. నివేదితా సతీష్ పాత్ర బొమ్మగా మిగిలింది. మిగతా నటీనటులు పాత్రలు తగ్గట్టు నటించారు.


Also Read: ఓ2 సినిమా రివ్యూ: పెళ్లి తర్వాత నయనతార మొదటి సినిమా ఎలా ఉందంటే?
  
చివరగా చెప్పేది ఏంటంటే: 'సుడల్' చూడాలంటే కాస్త ఓపిక, ఓర్పు ఉండాలి. ఎందుకంటే... దీని నిడివి ఎక్కువ. ఇందులో సాగదీత ఉంది. కథనం ఊహించేలా ఉన్నప్పటికీ... నటీనటుల అద్భుత అభినయం వల్ల చాలా సన్నివేశాలను అలా చూస్తుంటాం. నాలుగైదు ఎపిసోడ్స్ భారంగా ముందుకు కదులుతాయి. చివరి మూడు ఎపిసోడ్స్ కొంచెం స్పీడుగా, ఎమోషనల్‌గా ముందుకు సాగాయి. ట్విస్టులు ఆసక్తిగా లేవు. ఓటీటీల్లో క్రైమ్ సిరీస్‌లు చూసే వాళ్ళను 'సుడల్' డిజప్పాయింట్ చేస్తుంది. 


Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?