వెబ్ సిరీస్ రివ్యూ: రెక్కీ (ఏడు ఎపిసోడ్లు, 2.40 గంటల నిడివి)
రేటింగ్: 3.25/5
నటీనటులు: శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, ఎస్తేర్, సమ్మెట గాంధీ, తోటపల్లి మధు, శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్, రామరాజు, జీవా, ధన్యా బాలకృష్ణ తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్ కె. మహేష్
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
నిర్మాత: శ్రీ రామ్ కొలిశెట్టి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పోలూరు కృష్ణ
విడుదల తేదీ: జూన్ 17, 2022 (జీ 5 ఓటీటీలో)


రాజకీయ నేపథ్యంలో తెలుగులో కొన్ని వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అధికారం కోసం పదవిలో ఉన్నవాళ్ళను హత్య చేయడం వంటి కథలతో తెరకెక్కినవీ ఉన్నాయి. 'రెక్కీ' వెబ్ సిరీస్ సైతం రాజకీయం, హత్య, కలహాలు నేపథ్యంలో సాగుతుంది. ఇది ఎలా ఉంది? (Recce Telugu Web Series Review) శ్రీరామ్, శివ బాలాజీ, 'ఆడు కాలమ్' నరేన్, ఎస్తేర్ తదితరులు నటించిన 'రెక్కీ' వెబ్ సిరీస్‌లో ప్రత్యేకత ఏంటి?


కథ (Recce Web Series Story): అది 'కొండవీటి దొంగ' థియేటర్లలో ఆడుతున్న రోజులు... తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ వరదరాజులు (ఆడు కాలమ్ నరేన్)ను హత్య చేయడానికి ఆయన చేతిలో ఎన్నికల్లో ఓటమి పాలైన రంగనాయకులు దగ్గర పనిచేసే కుళ్లాయప్ప (తోటపల్లి మధు) వేరే ప్రాంతాలకు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చి తీసుకొస్తాడు. తనపై హత్యాయత్నం జరుగుతోందన్న విషయాన్ని గుర్తించిన వరదరాజులు కన్నకొడుకు చలపతి (శివ బాలాజీ)ని సైతం అనుమానిస్తాడు. కట్ చేస్తే... వరదరాజులు హత్యకు గురైన ఆరు నెలలకు చలపతి కూడా హత్యకు గురవుతాడు. తండ్రీ కుమారులను హత్య చేసింది ఎవరు? కుళ్లాయప్ప చేత సుపారీ ఇప్పించినది ఎవరు? ఈ కథలో రేఖ (ఎస్తేర్) పాత్ర ఏమిటి? ఈ హత్య కేసులను కొత్తగా డ్యూటీలో చేరిన సబ్ ఇన్స్పెక్టర్ లెనిన్ (శ్రీరామ్) ఎలా పరిష్కరించాడు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ: కామ తురాణం న భయం న లజ్జ (కామంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు భయం, సిగ్గు వంటివి ఉండవు) - పురాణాల నుంచి చెబుతున్న మాట. ఇప్పుడీ మాట ఎందుకు ప్రస్తావనకు వచ్చిందనేది 'రెక్కీ' చూశాక తెలుస్తుంది. బహుశా... 'రెక్కీ' వెబ్ సిరీస్‌కు మూలం ఈ లైన్ ఏమో!? సగటు రాజకీయ వెబ్ సిరీస్‌ల‌కు 'రెక్కీ'ని కాస్త భిన్నంగా నిలిపిన అంశమూ కామవాంఛ, ఒక మహిళ పాత్రే.


వెబ్ సిరీస్ ఎలా ఉంది?: 'రెక్కీ' చూశాక... ముందుగా మనకు గుర్తొచ్చేది నేపథ్య సంగీతం! ఆ తర్వాత సినిమాటోగ్రఫీ! సంగీత దర్శకుడు శ్రీరామ్ మద్దూరి, ఛాయాగ్రాహకుడు రామ్ కె. మహేష్... ఇద్దరూ దర్శకుడు పోలూరు కృష్ణ ఊహకు ప్రాణం పోశారు. ఒకవేళ సంగీతం, ఛాయాగ్రహణం అలా లేకపోతే 'రెక్కీ' మరోలా ఉండేదేమో!


ఇక, సిరీస్ ఎలా ఉందనే విషయానికి వస్తే... పర్ఫెక్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ ఇది. మొదట ఎపిసోడ్ నుంచి చివరి వరకూ సస్పెన్స్ మైంటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. మూడు దశాబ్దాల క్రితం... 1990లలో  వాతావరణాన్ని తెరపై బాగా ఆవిష్కరించారు. కథలో మలుపులు బాగా రాసుకున్నారు. అయితే... రాజకీయం, ప్రత్యర్థుల వేసే ఎత్తుపైఎత్తులు వంటివి కొన్ని సినిమాలు, సిరీస్‌ల‌లో చూశాం కనుక వాటిని ఇంకాస్త బాగా రాసుకోవాల్సింది. ట్విస్టులు, స్క్రీన్ ప్లేతో పాటు స్టోరీ మీద మరింత దృష్టి పెడితే బావుండేది. సన్నివేశాలు కొన్ని రొటీన్ గా ఉండటం మైనస్. 


భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన తర్వాత భార్య స్పందించే తీరు రొటీన్ అనిపించినా... చివరకు ఆ పాత్రలకు ఇచ్చిన ముగింపు కొత్తగా ఉంటుంది. ఇక, పరాయి పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకున్న మహిళ పాత్రను తీర్చి దిద్దిన తీరు భిన్నంగా ఉంది. సన్నివేశాలను హుందాగా తెరకెక్కించారు. 1990 నేపథ్యం తీసుకోవడం వల్ల కొన్ని లాజిక్స్ వర్కవుట్ అయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు స్వేచ్ఛ తీసుకున్నారు. థ్రిల్లర్స్‌లో ఎవరో ఒకరిపై అనుమానం వచ్చేలా చేసి కథను నడిపించడం రెగ్యులర్ స్టైల్. కొన్ని విషయాల్లో ఆ రూటును ఫాలో అయ్యారు.   


నటీనటులు ఎలా చేశారు?: 'రెక్కీ'లో వాళ్ళకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కింది, వీళ్ళకు తక్కువ స్క్రీన్ స్పేస్ లభించిందనే ఆలోచన రాదు. చూస్తున్నంత సేపూ అలా ముందుకు వెళుతుంది. 'ఆడు కాలమ్' నరేన్, శ్రీరామ్, శివ బాలాజీ, తోటపల్లి మధు, సమ్మెట గాంధీ... ఈ ఐదుగురూ పాత్రలకు న్యాయం చేశారు. అయితే, అందరిలో శివ బాలాజీకి వెయిట్ ఉన్న క్యారెక్టర్ లభించింది. ఆయన పాత్రలో షేడ్స్ కూడా బావున్నాయి. రేఖ పాత్రకు అవసరమైన శృంగార రసాన్ని కొంటెనవ్వు, బాడీ లాంగ్వేజ్‌తో పలికించారు ఎస్తేర్. శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ తమ నటనతో ఆయా పాత్రలకు హుందాతనం తీసుకొచ్చారు. 'రెక్కీ'లో మహిళల పాత్రలను బలంగా రాశారు. ఎమ్మెల్యే పాత్రలో జీవా కనిపించారు. ధన్యా బాలకృష్ణ పాత్ర నిడివి తక్కువే. ఆమెతో పాటు మిగతా నటీనటులు తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు. 


Also Read: జనగణమన రివ్యూ: థ్రిల్ చేస్తూనే ఆలోచింపజేసే సినిమా!


చివరగా చెప్పేది ఏంటంటే: సుమారు రెండున్నర గంటల నిడివి గల 'రెక్కీ'లో వీక్షకులను డిజిటల్ స్క్రీన్ ముందు నుంచి కదలనివ్వకుండా కూర్చోబెట్టే సత్తా ఉంది. ఇంతకు ముందు చెప్పినట్టు... 'రెక్కీ'లో సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బావున్నాయి. దర్శక - రచయిత పోలూరు కృష్ణ కథలో మలుపులను చక్కగా రాసుకున్నారు. అంతే చక్కగా తెరకెక్కించారు. పాత్రలకు న్యాయం చేసే తారాగణం తోడు కావడంతో ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠకు గురి చేస్తూ ముందుకు వెళుతుంది. 'రెక్కీ' వీక్షకులను ఆకట్టుకుంది. అందులో నో డౌట్!


Also Read: 'కిన్నెరసాని' రివ్యూ: కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ స‌ర్‌ప్రైజ్‌ చేసింది, ఈ సినిమా ఎలా ఉందంటే?