సినిమా రివ్యూ: జనగణమన
రేటింగ్: 3.5/5
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజారమూడు, మమతా మోహన్‌దాస్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాణ సంస్థ: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: డిజో జోస్ ఆంటోనీ
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం: నెట్‌ఫ్లిక్స్
మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన ప్రధాన పాత్రలో నటించిన జనగణమన అనే సినిమా మలయాళంలో థియేటర్లలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ సినిమాను ‘జన’ పేరుతో డబ్ చేసి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే థ్రిల్లింగ్ కోర్ట్ రూం డ్రామా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా?
కథ: సబా మరియం (మమతా మోహన్‌దాస్) అనే కాలేజ్ ప్రొఫెసర్ మృతదేహం రోడ్డు పక్కన కాలిపోయి కనిపిస్తుంది. పోస్టుమార్టం నివేదికలో తనను అత్యాచారం చేసి, చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసినట్లు తేలుతుంది. కేసును ఏసీపీ సజ్జన్ కుమార్ (సూరజ్ వెంజారమూడు)కు అప్పగిస్తారు. ఒక ప్రత్యక్షసాక్షి చెప్పిన సాక్ష్యం ఆధారంగా నలుగురిని సజ్జన్ అరెస్టు చేస్తాడు. అయితే పొలిటికల్ ప్రెజర్ కారణంగా ఆ కేసును వేరే ఆఫీసర్‌కి అందించాల్సి వస్తుంది. నిందితులను వేరే స్టేషన్‌కి షిప్ట్ చేసే సమయంలో సజ్జన్ వారిని ఎన్‌కౌంటర్ చేస్తారు. దీనిపై హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కోర్టులో కేసు పెడతారు. ఆ కేసులో సజ్జన్‌కు వ్యతిరేకంగా వాదించడానికి లాయర్ అరవిందన్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వస్తాడు. అసలు అరవిందన్ ఎవరు? ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ: ముందుగా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న దర్శకుడు డిజో జోస్ ఆంటోని, నటించడంతో పాటు నిర్మించడానికి కూడా ముందుకు వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్‌లకు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. మనం రోజూ చూసే వార్తల్లోని మరో కోణాన్ని ఆవిష్కరించేలా సినిమాను తెరకెక్కించారు. కేసులను మానిపులేట్ చేయడంలో మీడియా పాత్ర, జనాలు కోరుకునే ఇన్‌స్టంట్ జస్టిస్ వల్ల లాభనష్టాలు ఇలాంటి అంశాలను కూడా సినిమాలో ప్రస్తావించారు.
జనగణమన సెకండాఫ్ అంతా కోర్టులోనే జరుగుతుంది. కోర్టు రూంలోనే గంటకు పైగా సినిమాను గ్రిప్పింగ్‌గా నడిపించడం మామూలు విషయం కాదు. డిజో జోస్ ఆంటోని ఈ విషయంలో 100 శాతం సక్సెస్ అయ్యారు. ప్రథమార్థంలో మన కంటికి కనిపించిన ప్రతి సన్నివేశం వెనకాల కనిపించని మరో నేపథ్యం ఉంటుంది. దాన్ని సెకండాఫ్‌లో రివీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ అంతా స్టోరీని బిల్డ్ చేయడం సరిపోతుంది. ప్రొఫెసర్ హత్య, దాని తర్వాత స్టూడెంట్స్ నిరసనలు, ఏసీపీ ఎంట్రీ, నిందితులను పట్టుకోవడం, ప్రొఫెసర్ తల్లి ఆవేదన... ఇలా కథను పద్ధతి అమర్చుకుంటూ వెళ్లాడు. అయితే దీనికి కొంచెం సమయం పట్టడం, ఆ సన్నివేశాలు కూడా స్లోగా సాగడంతో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది.
కానీ ఒక్కసారి పృథ్వీరాజ్ ఎంటర్ అయ్యాక సినిమా గ్రాఫ్ పెరుగుతుంది. ప్రతి సన్నివేశం తర్వాత ఏంటి అనే ఉత్కంఠను పెంచుతుంది. డిజో జోస్ ఆంటోని సెకండాఫ్‌ను ఎంతో బ్రిలియంట్‌గా రాసుకున్నాడు. ఒక్కో సీన్ వెనక మల్టీపుల్ లేయర్స్ ఉంటాయి. సినిమాను చూస్తున్నంత సేపు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు ఆకట్టుకుంటుంది. ఒకే లొకేషన్‌లో సెకండాఫ్ మొత్తం జరిగేటప్పుడు కంటికి బోర్ కొట్టకుండా ఉండాలంటే సినిమాటోగ్రాఫర్ మాయ చేయాల్సిందే. సుదీప్ ఎలమోన్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో షార్ప్‌గా ఉండాల్సింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు కొత్తేమీ కాదు. తన నటనతో అరవిందన్ స్వామినాథన్ పాత్రకు ప్రాణం పోశాడు. ఇంటెన్స్ కోర్ట్ డ్రామా సీన్లు, ఎమోషనల్ సీన్లలో బాగా ఆకట్టుకుంటాడు. సజ్జన్ కుమార్ పాత్రలో కనిపించిన సూరజ్ ఆకట్టుకుంటాడు. క్లైమ్యాక్స్, ఎమోషనల్ సన్నివేశాలను తన నటన మరో స్థాయికి తీసుకువెళ్తుంది. మమతా మోహన్ దాస్ కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయే పాత్ర చేసింది. మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ఇంటెన్స్ సినిమాలు, థ్రిల్లర్లు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. వార్తల వెనక కోణాలు తెలుసుకోవాలంటే జనగణమన తప్పనిసరిగా చూడాల్సిందే. ఓటీటీలోనే అందుబాటులో ఉంది కాబట్టి వీకెండ్‌లో ఓ లుక్కేయచ్చు!