హిందీ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీతో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది హీరోలు కోరుకుంటారు. దర్శకుడిగా తమకు ఆయనే స్ఫూర్తిగా అని చెప్పిన దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి దర్శకుడు ఓ సినిమా తనకు నచ్చిందని చెప్పడం విశేషమే కదా! అసలు, వివరాల్లోకి వెళితే...


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'పుష్ప: ది రైజ్'. హిందీలోనూ ఈ సినిమా సంచనల విజయం సాధించింది. ఉత్తరాది ప్రేక్షకులు, పలువురు సినీ ప్రముఖులను సినిమా ఆకట్టుకుంది. 'పుష్ప' నచ్చిన ప్రముఖులలో 'మున్నాభాయ్', '3 ఇడియట్స్', 'పీకు', 'సంజు' సినిమాలు తీసిన దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా చేరారు. ఇటీవల సుకుమార్‌కు ఆయన ఒక మెసేజ్ చేశారు. 


''డియర్ సుకుమార్! మీకు ఈ మెసేజ్ ఎప్పుడో పంపించాల్సింది. నేను 'పుష్ప' చూసినప్పటి నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే, నా దగ్గర మీ నెంబర్ లేదు. ఒక మిత్రుడి దగ్గర తీసుకున్నా. 'పుష్ప' గురించి నా స్నేహితులతో చాలాసార్లు మాట్లాడాను. బహుశా... ఒక సినిమా గురించి నేను అంతలా మాట్లాడటం చూసి వారు ఆశ్చర్యపోయి ఉంటారు. మీ రచన, ప్రతి సన్నివేశాన్ని మలిచిన తీరు, నటీనటుల ప్రతిభ, సంగీతం.... అన్నీ గొప్పగా ఉన్నాయి. అద్భుతమైన సినిమా తెరకెక్కించారు. నేను ఆద్యంతం ఆస్వాదించాను. మీరు ముంబై వస్తే ఫోన్ చేయండి. మీట్ అవుదాం'' అని రాజ్ కుమార్ హిరాణీ పేర్కొన్నారట.


Also Read: చీకటిని వణికించే అస్త్రం, వెయ్యి నందుల బలం - 'బ్రహ్మాస్త్ర'లో అనీష్ శెట్టిగా కింగ్ నాగార్జున


రాజ్ కుమార్ హిరాణీకి సుకుమార్ థాంక్స్ చెప్పారు. ''ఫిల్మ్ మేకింగ్ లో మాస్టర్ లాంటి హిరాణీ దగ్గర నుంచి ప్రశంసలు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. రైటింగ్ లో, సినిమా రూపకల్పనలో ఆయనే నాకు స్ఫూర్తి'' అని సుకుమార్ తెలిపారు. హిరాణీ ప్రశంసల తర్వాత 'గతం'లో 'పుష్ప' ప్రెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. అవేంటో మీరూ చూడండి.


Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?