నుపుర్ శర్మపై ఒవైసీ సెటైర్స్‌ 


భాజపా నేత నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్త్‌పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇప్పటికీ ఆ వేడి ఇంకా చల్లారలేదు. అప్పటికప్పుడు అధిష్ఠానం ఆమెను సస్పెండ్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నుపుర్ శర్మవ్యాఖ్యల్ని మరో భాజపానేత నవీన్ జిందాల్  సమర్థించటం వల్ల ఇద్దరిపైనా వేటు పడింది. ఇది క్రమక్రమంగా ఆందోళనలకు దారి తీసింది. యూపీలో రెండు వర్గాల మధ్య తీవ్రక ఘర్షణ జరిగింది. ఈ వివాదం దేశాలు దాటి కువైట్ వరకూ వెళ్లింది. భారత్ ఉత్పత్తులపై ఆ దేశం నిషేధం కూడా విధించింది. ఇవన్నీ జరుగుతుండగానే AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. 


ప్రధాని మోదీ నోరు మెదపటం లేదు-ఒవైసీ


ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ భవిష్యత్‌లో బడా రాజకీయ నేతగా ఎదుగుతారని, దిల్లీకి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఒవైసీ. చట్టప్రకారం ఆమెపై చర్య తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. "రాజ్యాంగం ప్రకారం ఎలాంటి శిక్ష వేయొచ్చో చూసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి" అని అన్నారు. భాజపా ఆమెకు అండగా నిలుస్తోందని విమర్శించారు. "నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ఎన్నో రోజులుగా మేము వివరణ అడుగుతున్నాం. కానీ ప్రధాని మోదీ నోరు మెదపటం లేదు. ఆమెపై ఇప్పటికే ఫిర్యాదు చేశాం. ఎఫ్ఐఆర్‌ కూడా నమోదైంది. రాష్ట్రం నుంచి పోలీసులను దిల్లీకి పంపించి ఆమెను 
అరెస్ట్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 


వెంటనే అరెస్ట్ చేయాల్సిందే 


యూపీలో యాక్టివిస్ట్ ఫాతిమా ఇల్లు కూల్చివేయటంపైనా మండిపడ్డారు ఒవైసీ. యూపీ సర్కార్‌ ఆమె ఇంటిని ఎందుకు కూల్చివేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫాతిమా వాళ్ల తండ్రి అల్లర్లు సృష్టించాడని భాజపా ఆరోపణలు చేస్తోందని, అది నిజమా కాదా తేలక ముందే ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఆయన అల్లర్లు సృష్టించాడా లేదా అన్నది విచారణ చేసిన తరవాత తెలుస్తుందని, కోర్ట్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇష్టారాజ్యంగా ఇల్లు కూల్చేయటమేంటని మండిపడ్డారు. ఆయన తప్పు చేస్తే వాళ్ల, భార్యని, 
పిల్లల్ని శిక్షించటం ఏంటని నిలదీశారు. ఇప్పటికే పలువురు ముస్లిం నేతలు నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్‌లు వినిపించారు. నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్‌పైనా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా జరిగిన గొడవల్లో రాంచీలో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతానికి గల్ఫ్‌ దేశాలన్నీ భారత్‌పై చాలు గుర్రుగా ఉన్నాయి.