Ayyanna Patrudu house in Narsipatnam : టీడీపీ పొలిటీబ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన ఇంటి భాగంలో ఉన్న గోడను నర్సీపట్నం మునిసిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చేశారు. అయ్యన్న పాత్రుడు రెండు సెంట్లు స్థలం అక్రమించుకున్నారని ఆరోపణలు రాగా, దానిపై శనివారం రాత్రి టీడీపీ నేత ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయ్యన్న పాత్రుడ్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం కావడంతో నర్సీపట్నంలోని ఆయన ఇంటికి అభిమానులు, పార్టీ కార్యకర్తకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయ్యన్నను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.


పోలీసులతో కుటుంబసభ్యుల వాగ్వాదం
మాజీ మంత్రి అయ్యన్న ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు వేసి పెద్ద సంఖ్యలో పహారా కాస్తున్నారు. మరోవైపు సెలవురోజు కావడంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం, పోలీసులు టీడీపీ నేతను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. శనివారం రాత్రి అయ్యన్న ఇంటికి నోటీసులు పంపించిన అధికారులు, ఆదివారం వేకువజామున రంగంలోకి దిగి అయ్యన్న ఇంటి వెనుక గోడను జేసీబీతో తొలగించేందుకు యత్నం చేశారు. అయితే రాత్రి నోటీసులు ఇచ్చి, తెల్లారే వచ్చి కూల్చివేతలు చేయడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.



నోటీసులు ఇచ్చిన గంటల వ్యవధిలో ఇలా చేయడం కక్ష పూరిత వ్యవహారం అంటూ పోలీసులు, అధికారులతో వాగ్వివాదానికి దిగడంతో గోడ కూల్చివేత కొంతసేపు నిలిపివేశారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలో అయ్యన్న ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతో.. నర్సీపట్నం మునిసిపల్ సిబ్బంది జేసీబీతో గోడ తొలగింపు పనులు తిరిగి మొదలుపెట్టారు. మరోవైపు అయ్యన్న ఇంటికి వచ్చే రెండు మార్గాలను సైతం పోలీసులు బ్లాక్ చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.


మినీ మహానాడులో వ్యాఖ్యల ఎఫెక్ట్ !
ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన మినీ మహానాడులో సీఎం వైఎస్ జగన్‌పై, ఏపీ మంత్రులపై మాజీ మంత్రి అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిలోని 2 సెంట్లు భూమి ఆక్రమించారని, పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని  నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ అయ్యన్నకు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అనకాపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటీవల మంత్రి రోజాపై సైతం అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. నిన్న రాత్రి నోటీసులిచ్చిన అధికారులు నేటి ఉదయమే అరెస్ట్ చేసేందుకు అయ్యన్న ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. మీడియాను అయ్యన్న ఇంటి పరిసరాల్లోకి రానీయకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.  


Also Read: Vellampalli Srinivas: మాజీ మంత్రిని నిలదీసిన యువకుడు- తక్షణం కేసు పెట్టాలన్న వెల్లంపల్లి- తలలు పట్టుకున్న పోలీసులు !


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, మరో 3 గంటల్లో ఆ జిల్లాల్లో వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ