చంద్ర‌బాబు ఏమైనా పుడింగా.. స్వశక్తి లేని వ్యక్తి.. ప్రజలతో ఛీ కొట్టి వ్య‌క్తి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్ర‌బాబు చెప్పేవ‌న్నీ ప‌నికి మాలిన మాట‌ల‌ని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బైజూస్‌తో ఒప్పందం తప్పని ప్రపంచంలో ఏ ఒక్కరితో అయినా చంద్ర‌బాబు చెప్పించ‌గ‌ల‌రా సవాల్ చేశారు బొత్స సత్యనారాయణ. 35 లక్షల మంది పేద విద్యార్థులకు ఉచితంగా బైజూస్‌తో అవగాహన కల్పిస్తుంటే పనికి మాలిన విమర్శలు చేస్తారా అంటూ నిల‌దీశారు.


బైజూస్ అంటే హెరిటేజ్‌లో అమ్మే జ్యూస్ కాదని.. మతిభ్రమించి బాబు విమర్శలు చేస్తున్నార‌ని బొత్సా వ్యాఖ్యానించారు. తాడేప‌ల్లిలోని పార్టి కార్యాల‌యంలో బొత్సా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాటలన్నీ విన్నానని... ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం సహజమన్నారు. అయితే రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పే చంద్రబాబు.. తనపై చేసిన విమర్శలు, ఆయన వాడిన భాష దారుణమన్నారు. ఆయన మాటలు వింటే చంద్రబాబు పూర్తిగా సహనం కోల్పోయినట్లు.. ఇక ఆయన పని అయిపోయినట్లు అనిపిస్తోందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు అంత పనికిమాలిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని నిల‌దీశారు బొత్స. చంద్రబాబు మాట్లాడుతున్న భాష చూస్తే.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందన్నాారు. 


బైజూస్ అంటే జ్యూస్ కాదు


చంద్రబాబు మాటల్లో ఒక్కటంటే ఒక్కటైనా బాధ్యతగా మాట్లాడారా అని ప్రశ్నించారు బొత్స. రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అంశం కానీ ఉందా అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుంటే, అది బైజూసో.. జగన్‌మోహన్‌రెడ్డి జూసో.. అంటావా.. ఏమిటా వెటకారమన్నారు, బైజూస్‌ అంటే హెరిజేట్‌లో అమ్మే ఏదైజా జ్యూస్‌ అనుకుంటున్నారా  లేక హెరిటేజ్‌ పాలతో చేస్తున్న జ్యూస్‌ అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. బైజూస్‌ అనేది 150 మిలియన్ల విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్న కంటెంట్‌ సంస్థ అని... దాని గురించి తెలియకపోతే, చంద్రబాబు మనవణ్ని అడుగితే చెబుతాడు.


ఇంగ్లీష్‌ బోధన అంటే మమ్మీ - డాడీ అనడం కోసమేనా, మరి చంద్రబాబు అబ్బాయిని అందుకే ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదివించారా అని బొత్స ప్రశ్నించారు. కేవలం  డాడీ అని పిలవడానికేనా, మరి దేని కోసం, ఎందు కోసం లోకేష్‌ను విదేశాల్లో చదువు కోసం పంపించారని నిలదీశారు.   అంటే చంద్రబాబు లాంటి వారి పిల్లలు, మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్‌లో చదవాలని.... వారు మాత్రమే విదేశాలకు వెళ్లాలని. ఆ తర్వాత తిరిగి వచ్చి మీ మాదిరిగా దోచుకు తినాలనా మీ ఉద్దేశం అని ప్రశ్నించారు.