ఉదయం లేవగానే కప్పు కాఫీ లేదా కప్పు టీ చేతిలో ఉండాల్సిందే. ఇలా రోజును ప్రారంభించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. అయితే కాఫీలో ఉండే కెఫిన్‌ను ఖాళీ పొట్టతో తాగడం వల్ల జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువ. పొట్ట సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు ఉదయం పూట కెఫీన్ తీసుకోవడం మంచిది కాదు. పొట్టలో మంట, ఎర్రబడడం వంటి సమస్యలు రావచ్చు. పొట్టలోని పలుచని లైనింగ్‌ను ఇబ్బంది పెడుతుంది. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాలను పెంచుతుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత, పొట్ట ఉబ్బరం, మలబద్ధకం, వేడి చేయడం వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కెఫిన్ లేని హెర్బల్ టీని పరగడుపున తాగడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా మైగ్రేన్, ఎసిడిటీ, వికారం, తలనొప్పి, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ హెర్బల్ టీ ఎంతో మేలు చేస్తుంది. ఆ సమస్యలను తగ్గించడానికి సాయపడుతుంది. దీన్ని తయారు చేయడం చాలా సులువు.


స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీరు పోయాలి. మీడియం మంట మీద ఉంచాలి. రెండు రెమ్మల కరివేపాకులు, గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసి కలపాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలు, రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వడకట్టి ఆ నీటిని గ్లాసులో వేయాలి. అంతే... అద్భుతమైన ఔషధ తేనీరు రెడీ అయినట్టే. దీన్ని పరగడుపున తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. 


దీనిలో కెఫీన్ ఉండదు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ హెర్బల్ టీలో అర స్పూన్ నెయ్యి లేదా ఒక స్పూను కొబ్బరి నూనె వేసుకుని తాగితే ఇంకా మంచిది. ఇది పేగులకు ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీ కూడా తాగడం వల్ల మంచే జరుగుతుంది. వీటిలో చక్కెరను వేసుకోరు కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉండదు. ఈ హెర్బల్ టీలో చాలా తక్కువ కాబట్టి, ఇన్సులిన్ అధికంగా ఒకేసారి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉండదు. మితంగా, నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది.  టీ, కాఫీల కన్నా ఈ ఔషధ గుణాలు నిండిన టీని తాగడం అలవాటు చేసుకోవాలి.



Also read: రోజుకు నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగితే మధుమేహం సమస్య తగ్గిపోతుందా?


Also read: మీ బ్లడ్ గ్రూపును బట్టి ఆహారం తింటే ఎంతో ఆరోగ్యం, ఇదే బ్లడ్ గ్రూప్ డైట్






















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.