Home Remedies for Sore Throat : చలికాలంలో, పొడివాతావరణంలో వచ్చే ప్రధాన సమస్యల్లో గొంతు నొప్పి ఒకటి. దీనివల్ల గొంతు పొడిబారిపోయి.. సరిగ్గా మాట్లాడనివ్వకుండా.. నోరు తెరవలేకుండా చేస్తుంది. ఫుడ్ తింటున్నప్పుడు కూడా విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది. ఇది శరీరానికి వచ్చే అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇది అంటువ్యాధుల వల్ల, పొడి గాలి, కాలుష్యం వల్ల వస్తుంది. కాస్త అసౌకర్యాన్ని కలిగించినా.. దానికదే స్వయంగా తగ్గిపోతుంది. అయితే అందరికీ ఇలా తగ్గిపోతుందని చెప్పలేము. 


గొంతు నొప్పి లక్షణాలు


వ్యక్తిని బట్టి గొంతు నొప్పి లక్షణాలు మారుతూ ఉంటాయి. కొందరికి పూర్తిగా పొడిబారిపోవడం. మాట్లాడుతుంటే గుర్ గుర్ అనడం, పొడి దగ్గు రావడం, గొంతులో చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మింగినప్పుడు, మాట్లాడేప్పుడు నొప్పి బాధిస్తూ ఉంటుంది. ఈ సమయంలో గొంతు లేదా టాన్సిల్స్ ఎర్రగా మారిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు టాన్సిల్స్​పై తెల్లటి పాచీ పేరుకుపోతుంది. ఈ తెల్లటి పాచెస్ వైరస్ వల్ల వస్తాయి. ఇవి నొప్పి తీవ్రతను మరింత పెంచుతాయి. 


కొందరిలో గొంతు నొప్పి సమయంలో ముక్కు దిబ్బెడ, తుమ్ములు, దగ్గు, జ్వరం, చలి, మెడలో వాపు గ్రంథులు, సరిగ్గా మాట్లాడలేకపోవడం, బాడీ పెయిన్స్, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా జలుబు, ఫ్లూ, చికెన్ పాక్స్​తో సహా వైరల్ ఇన్​ఫెక్షన్ల వల్ల గొంతు నొప్పి వస్తుంది. చాలా సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్​ వల్ల వచ్చే గొంతు నొప్పి ఎటువంటి చికిత్స చేయకపోయినా దానంతట అదే మెరుగుపడుతుంది. బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వస్తే కచ్చితంగా యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. 


ఇంటి నివారణలు


గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని ఇంటి నివారణలు గొప్పగా పనిచేస్తాయి. మీ రోగనిరోధక శక్తి ఇన్ఫెక్షన్​తో పోరాడుతుంది కాబట్టి.. ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్, కషాయాలు తీసుకోండి. ఈ సమయంలో ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే త్వరగా దీనినుంచి బయట పడొచ్చు. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి దానితో పుక్కలించండి. ఇది గొంతు నొప్పిని దూరం చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.


హెర్బల్ టీలలో తేనె కలిపి తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. వేడి వేడి సూప్​లలో నిమ్మకాయ కలిపి తీసుకుంటే మంచిది. గొంతుకు ఉపశమనం అందించే హాట్ డ్రింక్స్ తాగితే మంచిది. ఇవి నొప్పి నుంచి చాలా వేగంగా మీకు రిలీఫ్ ఇస్తాయి. గొంతు మెరుగయ్యే వరకు మాట్లాకపోవడమే మంచిది. ఎందుకంటే నోరు తెరిచినప్పుడు లోపలికి వెళ్లే బ్యాక్టిరీయా పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదముంది. 


జాగ్రత్తలు


గొంతునొప్పి రాకుండా నివారించలేము. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల దానిని దూరం చేసుకోవచ్చు. చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి, జలుబు ఉన్న వారికి సన్నిహితంగా ఉండడం తగ్గించండి. స్మోకింగ్ అలవాటు మానేస్తే మంచిది. గొంతు నొప్పి తగ్గకపోతే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించండి. 


Also Read : జలుబును తగ్గించడంలో మెడిసన్ పని చేయట్లేదా? ఈ ఇంటి చిట్కాలను ఫాలో అయిపోండి