AP Politics: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.. పార్టీలో ఇన్నాళ్లు కష్టపడ్డాం.. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, పార్టీ మమ్మల్ని గుర్తించాలి.. అని కొందరు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తుంటే గెలిచే సత్తా మాకు ఉంది. ఇంతవరకు పల్లకి మోసిన నేతలు స్థానికులు కాదు.. ఇకపై వారి నాయకత్వం మాకు అక్కర్లేదు మానుంచే నాయకులు రావాలి... అందుకే స్థానికులమైన మాకు టిక్కెట్టు కేటాయించాలని మరో ప్రధాన డిమాండ్‌ వినిపిస్తోంది. దీంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేక దాదాపు చాలా నియోజకవర్గాల ఇంచార్జ్‌లను ప్రకటించినా వైసీపీ మాత్రం అమలాపురం విషయంలో ఇంకా వాయిదాలు వేసుకుంటూ వస్తుండగా కాస్త ఆలస్యంగానైనా టీడీపీ నుంచి అయితే మరికొంత మంది ముందుకు వచ్చి మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డాం.. అధినాయకత్వం మమ్మల్ని గుర్తించాలి. అవకాశం కల్పించాలంటూ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. 


నేటికీ నియోజకవర్గ ఇంచార్జ్‌ను ప్రకటించని వైసీపీ..
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో హెడ్‌ క్వార్టర్‌ అయినటువంటి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఎవ్వరినీ నియమించకపోవడం వెనుక ఆపార్టీలో ఆశావాహులు ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.. అమలాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ మంత్రిగా పినిపే విశ్వరూప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశ్వరూప్‌తోపాటు ఆయన కుమారుడు పినిపే శ్రీకాంత్‌ కూడా యాక్టివ్‌గా ఉండడంతో సర్వే ద్వారా ఇద్దరిలో ఎవ్వరికి టిక్కెట్టు కేటాయించాలన్న సందిగ్ధంలో వైసీపీ అధిష్టానం పడిరది. ఆతరువాత తనయునికే కాదు అవకాశం కల్పిస్తే తండ్రి విశ్వరూప్‌కే ఇవ్వాలన్న ఆలోచనతో తనయుడి నో చెప్పడంతో ఆయన వెనక్కు తగ్గారు. అయితే ఇటీవలే వైసీపీ సీనియర్‌ నేత, గుడ్‌సీడ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కుంచే రమణారావు కూడా బలప్రదర్శనకు దిగారు. ఈయనతోపాటుమరో ఇద్దరు కూడా తమకు అవకాశం కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేయడంతో ఈ కారణంతోనే నేటికీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ నియామకం పూర్తిచేయలేదని తెలుస్తోంది..


టీడీపీలో తొలగని సందిగ్ధత...
అమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా అయితాబత్తుల ఆనందరావు ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీతో పోటీగా జనసేన పార్టీ అభ్యర్ధి శెట్టిబత్తుల రాజబాబు కూడా ఇప్పటికే మహా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఈ స్థానం నుంచి టీడీపీ పోటీచేస్తుందా లేక జనసేన నా అన్న సందిగ్ధత తొలగడం లేదు. అమలాపురం మేము పోటీచేస్తాం అంటే మేము అన్న పరిస్థితి జనసేన, టీడీపీ అభ్యర్థుల నుంచి కనిపిస్తోంది.. అయితే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా హెడ్‌క్వార్టర్‌ అవ్వడంతో ఇక్కడ టీడీపీకే అవకాశం దక్కుతుందన్న వాదన వినిపిస్తోంది..


మూడు పార్టీల్లోనూ ఆశావాహుల జోరు..
అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. వైసీపీ నుంచి మంత్రి విశ్వరూప్‌ ఇప్పటికే రేస్‌లో ఉండగా, గుడ్‌సీడ్‌ ఫౌండేషన్‌ అధినేత కుంచే రమణారావు కూడా నేను బరిలో ఉంటానని తేల్చిచెపుతున్నారు. ఇప్పటికే ఆయన స్వగ్రామం అయిన చల్లపల్లిలో ఆత్మీయ సమావేశం పేరిట బల ప్రదర్శన చేశారు. స్థానికులకే ఈ సారి టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్‌తో ముందుకు రాగా ఇన్నాళ్లు పల్లకీ మోసం ఇక చాలు మా నాయకత్వాన్ని మేము నిరూపించుకుంటామని తేల్చిచెప్పారు. ఇదే పార్టీ నుంచి మరికొందరు ద్వితీయశ్రేణి నాయకులు టిక్కెట్టు ఆశిస్తున్నారు.


టీడీపీ నుంచి నియోజకవర్గ ఇంచార్జ్‌ అయితాబత్తుల ఆనందరావు రేసులో ఉండగా మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి ఇప్పటికే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను, తన భర్త గత 30 ఏళ్లుగా పార్టీకు సేవలందిస్తున్నామని, ఈసారి తమలో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఫుడ్‌కమిషన్‌ మాజీ సభ్యుడు నాగాబత్తుల శ్రీనివాసరావు, పోతుల సుభాష్‌చంద్రబోస్‌ తదితరులు కూడా టీడీపీ టిక్కెట్టు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఇక జనసేన నియోజకవర్గ ఇంచార్జ్‌గా శెట్టిబత్తుల రాజబాబు టిక్కెట్టు ఆశిస్తుండగా ఆయనతోపాటు పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్‌ డీఎమ్మార్‌ శేఖర్‌ కూడా బరిలో ఉన్నానంటున్నారు.