YSRCP Fifth List : వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ (CM) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy ) అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections )గెలుపొందడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నాలుగు జాబితాలను రిలీజ్ చేసిన జగన్...ఐదో జాబితాపై కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా తాడేపల్లి (Tadepally)కి ఎమ్మెల్యేలను పిలుపించుకొని మాట్లాడుతున్నారు. టికెట్ ఇవ్వని నేతలకు సర్దిచెబుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వడంలో వివరిస్తున్నారు. పార్టీ కోసం పని చేయాలని, భవిష్యత్ లో మంచి అవకాశాలు కల్పిస్తామని జగన్ హామీ ఇస్తున్నారు.

Continues below advertisement


పార్టీ నేతలతోపాటు ఇంటెలిజెన్స్‌ నుంచి రహస్య రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతగా ఉన్న, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై వేటు వేస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పని తీరును సీఎం జగన్‌ పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు జాబితాల్ని విడుదల చేసిన సీఎం జగన్...త్వరలో ఐదో జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను సదరు నేతలకు వివరించారు. 


తాడేపల్లికి ఎమ్మెల్యేలు క్యూ


ఇప్పటికే ప్రకటించిన నాలుగు జాబితాల్లో  58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీల స్ధానాల్లో మార్పులు  చేర్పులు జరిగాయి. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు పిలుపు వస్తుండటంతో...వెళ్లి సీఎం జగన్ ను కలుస్తున్నారు.


శుక్రవారం  మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎంను కలిశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ను పెందుర్తి లేదా అనకాపల్లి ఎంపీ సీటులో పోటీ చేయించే అవకాశం ఉంది.మరోవైపు పాణ్యం నుంచి ఆరు సార్లు శాసనసభకు ఎన్నికైన కాటసాని రాంభూపాల్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన్ను కూడా నియోజకవర్గ బాద్యతల నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఐదో జాబితాలో కనీసం నాలుగు లేదా ఐదుగురు ఎంపీలు ఉంటారని తెలుస్తోంది. వీరి స్ధానాల్లో ఎమ్మెల్యేలను పంపడం లేదా కొత్త అభ్యర్ధులను ఎంపిక చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. 


నంద్యాల ఎంపీ సీటు ముస్లింలకు...


నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు క్రిష్ణదేవరాయలును మార్చే అవకాశం ఉంది. వీటితోపాటు పలు పార్లమెంట్ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఎంపీ లావు క్రిష్ణదేవరాయులు...సిట్టింగ్ స్థానం నర్సరావుపేట పార్లమెంట్ ను కోరుకుంటున్నారు. అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం గుంటూరుకు పంపించాలని భావిస్తోంది. దీనికి ఆయన అంగీకరించడం లేదు. నర్సరావుపేట పార్లమెంట్ నియోజవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి కూడా లావును బరిలోకి దించాలని సీఎం జగన్ కు చెప్పారు. నంద్యాల ఎంపీ సీటులో పోచ బ్రహ్మానందరెడ్డికి బదులుగా ముస్లిం అభ్యర్ధిని బరిలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో...తమకు కలిసి వస్తుందని జగన్ లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ నటుడు అలీ లేదా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఖాదర్ బాషాకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.  రేపు(ఆదివారం 21 జనవరి 2024) రాత్రికి లేదా ఎల్లుండి(సోమవారం 22 జనవరి 2024) ఐదో జాబితా వెలువడే అవకాశముంది.