CBSE Board Exams: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల విధానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Central Board Of Secondary Education) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే పరీక్షలను రెండుసార్లు రాయాలా లేదా ఎప్పటిలా ఒకేసారి రాయాలా అనేది విద్యార్ధుల ఇష్టమని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఐచ్ఛికం. విద్యార్థులు రెండు సార్లు తప్పనిసరిగా రాయాలన్న నిర్భంధమేమీ లేదని తెలిపింది. ఒకవేళ రెండు సార్లు పరీక్షలు రాస్తే.. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే.. ఆ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. 


ఒత్తిడి తగ్గించేందుకే..
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ ​తెలిపింది. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దాంతో పాటూ రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదని చెబుతున్నారు.


స్పోర్ట్స్, ఒలింపియాడ్‌ విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు..
జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో, అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొంటూ సీబీఎస్‌ఈ(CBSE) 10, 12 తరగతుల పరీక్షలు రాయలేని విద్యార్థుల కోసం సీబీఎస్ఈ బోర్డు ప్రత్యేక పరీక్షలను నిర్వహించాలని కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం రాతపరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది. కంపార్ట్‌మెంట్, ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా పరీక్షలను మాత్రం అందరితో కలిపే రాయాల్సి ఉంటుంది. క్రీడలు, ఎడ్యుకేషన్ పోటీల్లో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


జనవరి 29న 'పరీక్షా పే చర్చా'..
విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 29న నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చించనున్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతున్న ప్రస్తుత సమయంలో.. విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏఢాది దాదాపు 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు. 


పరీక్షా పే చర్చ కార్యక్రమానికి గతేడాదితో పోలిస్తే 14.93 లక్షల మంది ఉపాధ్యాయులు, 5.69 లక్షల మంది తల్లిదండ్రులు అధికంగా హాజరుకానున్నారు. 6వ నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు చర్చలో పాల్గొననున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్, ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో జనవరి 29న ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభంకానుంది. దీని చర్చ ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమంలో పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలనే పలువురు విద్యార్థుల ప్రశ్నలకు మోదీ తనదైన రీతిలో సమాధానం ఇస్తారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...