గడ్డాలు, మీసాలు మగవారి పురుషత్వానికి నిదర్శనాలు. కానీ కొందరి ఆడవాళ్లలో గడ్డాలు, మీసాలు మొలుస్తూ వారికి సమస్యగా మారాయి. నలుగురిలో వెళితే అసభ్యకరమైన కామెంట్లు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టీనేజీ వయసుకు వచ్చాకే కొంతమంది అమ్మాయిల్లో లేతగా మీసాలు, గడ్డాలు వస్తున్నాయి. దీని కోసం షేవింగ్లు, లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. మహిళల్లో ఇలా గడ్డాలు, మీసాలు రావడానికి కారణాలు ఏమిటి?
అసలెందుకు ఇలా?
ముఖంపై వెంట్రుకలు రావడానికి రెండు కారణాలు కావచ్చు. అవి ఒకటి జన్యుపరమైనవి, అంటే వారసత్వంగా వచ్చేవన్న మాట. పూర్వీకుల్లో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఇక రెండోది హార్మోన్ల అసమతుల్యత కూడా అవ్వచ్చు. హార్మోన్ల సంతులనం తప్పినప్పుడు కూడా మహిళల్లో గడ్డాలు, మీసాలు రావడం మొదలవుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల గడ్డాలు వస్తే దానని ‘జెనెటిక్ హైపర్ ట్రయికోసిస్’ అంటారు. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల కలిగే ఈ సమస్యను ‘హర్ స్యూటిజం’ అంటారు. అలాగే పీసీఓడీ (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్) ఉన్న వారిలో కూడా ఇలా ముఖంపై వెంట్రుకలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శక్తివంతమైన స్టెరాయిడ్లు వాడడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు. దీని వల్ల టెస్టోస్టెరాన్, ఎండ్రోజెన్ హార్మోన్లు విపరీతంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి పురుష హార్మోన్లు. వీటి వల్ల కూడా సమస్య పెరుగుతుంది. చికిత్స ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
ఆమె గడ్డమే హైలైట్
పదహారేళ్ల అమ్మాయి హర్మాన్ కౌర్. బ్రిటన్ లో నివసించే ఈ టీనేజి అమ్మాయికి పురుషుల్లాగే దట్టమైన గడ్డాలు వచ్చాయి. ఆమెకు పాలిసిస్టిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉంది. దీనివల్లే ముఖం, శరీరంపై వెంట్రులకు అధికంగా పెరుగుతున్నాయి. గడ్డాలు మరీ అధికంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఆమెను చాలా కుంగదీసింది. చివరికి ఆత్మ హత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించింది. కానీ మధ్యలో మంచి వాళ్ల స్పూర్తి వాక్యాలు ఆమెలో ఆశలు చిగురించేలా చేశాయి. తాను ఎలా ఉన్నానో ఆ రూపాన్ని స్వీకరించింది. అంతేకాదు గడ్డం షేవింగ్ చేసుకోవడం కూడా మానేసింది. ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా నిలిచింది. ఇప్పుడామె ఎక్కడికి వెళ్లినా గడ్డాలతోనే వెళుతుంది. అదే నా ఐడెంటిటీ అని చెబుతుంది. అయినా శారీరకంగా వచ్చే మార్పును స్వీకరించాల్సిన అవసరం ఉంది. దానికి చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా అవసరం అని చెబుతోంది హర్మాన్.
Also read: శాకాహారంతో మగవారు ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు