Telangana IT Minister KTR to Visit Warangal Today: తెలంగాణ ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె. తారక రామారావు నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పర్యటన (KTR Warangal Tour) నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మొత్తం రూ. 236.63 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వీటిలో వరంగల్ లో రూ. 193.03 కోట్లతో అభివృద్ధి పనులు, నర్సంపేటలో 43.60 కోట్లతో అభివృద్ధి పనులున్నాయి. టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులుగా దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్‌లు కీటీఆర్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేటీఆర్ వరంగల్ పర్యటన షెడ్యూల్..
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న వరంగల్, మహానగరం పరిధితోపాటు, నర్సంపేట నియోజకవర్గంలోని కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు కార్యక్రమాలకు శంకుస్థాపన, అనేక కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్ నర్సంపేటలో గంటపాటు గడుపుతారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ లో మధ్యాహ్నం 12.30 గంటలకు దిగనున్న కేటీఆర్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నర్సంపేట మున్సిపాలిటీ ఆవరణలో ఒకే చోట మెప్మ పరిపాలన భవనం, లైబ్రరీకి, చెన్నరావు పేట, దుగ్గొండి మహిళా సమాఖ్య భవనాలను కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఇంటింటికీ పైపుల ద్వారా వంట గ్యాస్
తెలంగాణలో మొదటిసారిగా ఇంటింటికీ పైపుల ద్వారా వంట గ్యాస్ లను సరఫరా చేసే మేఘా పైప్‌డ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్టును కేటీఆర్ ప్రారంభిస్తారు. ముందుగా నర్సంపేట నియోజకవర్గంలో పూర్తి చేశాక, ఇదే ప్రాజెక్టు నుంచి వరంగల్ నగరానికి కూడా గ్యాస్‌ను సరఫరా చేయనున్నారు. అనంతరం నర్సంపేటలో జరిగే సభలో మహిళలకు అభయ హస్తం నిధులు వాపస్ ఇస్తారు. అలాగే స్త్రీ నిధి నిధులను మంత్రి కేటీఆర్ పంపిణీ చేస్తారు. గతంలో 550 మంది క్రీడాకారిణులు పాల్గొన్న 9 రకాల గ్రామీణ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు కేటీఆర్ అందజేస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
జీడబ్ల్యూఎంసీలో పలు కార్యక్రమాలకు శ్రీకారం..
జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, సిఎంఏ, మునిసిపల్ సాధారణ నిధులు, స్మార్ట్ సిటీ, స్టేట్ గ్రాంట్ ఫండ్ పథకాల క్రింద 27.63 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, రూ.150.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడతారు. 7 కోట్ల వ్యయంతో భద్రకాళి దేవాలయ కమాన్ నుండి జీడబ్ల్యూఎంసీ కార్యాలయం వరకు నిర్మించిన నెంబర్ 4 రోడ్డును, రూ. 7 కోట్ల వ్యయంతో అలంకార్ దర్గా బ్రిడ్జ్ నుండి రోడ్ నెం.2 వరకు నిర్మించిన స్మార్ట్ రోడ్ ఆర్3 ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం రూ. 11.50 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన పబ్లిక్ గార్డెన్స్, రూ.1.5 కోట్ల వ్యయంతో కొత్తగా డెవలప్ చేసిన ప్రాంతీయ గ్రంథాలయాన్ని ప్రారంభిస్తారు. 27 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు వైకుంఠ రథాలను, రూ.36 లక్షలతో కొనుగోలు చేసిన 66 ఫాగింగ్ మెషిన్లను కేటీఆర్ ప్రారంభించనున్నారు.
రూ.8 కోట్లతో ఏర్పాటు చేయనున్న 150 కే ఎల్ డి, ఎఫ్ఎస్‌పిపికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. రూ. 20.50 కోట్లతో నిర్మించనున్న మహానగర పాలక సంస్థ పరిపాలనా భవనానికి, 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కౌన్సిల్ హాల్, రూ.2 కోట్లతో విద్యుత్ నగర్ లో నిర్మించనున్న దివ్యాంగుల శిక్షణ కేంద్రం, రూ.9 కోట్లతో 37 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి, రూ.1.50 కోట్లతో పోతన వైకుంఠధామం అభివృద్ధి, రూ.22 కోట్లతో నయీమ్ నగర్ నుండి ప్రెస్టీన్ స్కూల్ వరకు రిటైనింగ్ వాల్ ఏర్పాటు, రూ.15 కోట్లతో నాలాల మీద కల్వర్టుల నిర్మాణానికి, జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో రూ.71 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, రూ.2.50 కోట్లతో కాజీపేట నుండి పెద్దమ్మగడ్డ వరకు ఆర్సీసి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, రూ.70 లక్షలతో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ లో ఏర్పాటు చేయనున్న జాతీయ జెండా, జీడబ్ల్యూఎంసీ ఆవరణలో రూ.4 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు జీడబ్ల్యూఎంసీ ఆఫీసు వద్ద మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుదీర్ కుమార్, రాష్ట్ర వికలాంగుల సహకరా సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, అరూరి రమేశ్, ఒడితెల సతీశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, డిసిసిబి చైర్మన్ మార్నేని రవిందర్ రావు, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తదితరులతో కలిసి వరంగల్‌లో మంత్రి కెటిఆర్ పర్యటించనున్న ప్రదేశాలను సందర్శించి, ఆయా పనులను పరిశీలించారు. ముందుగా హన్మకొండ హయగ్రీవాచారి కాంపౌండ్ లో జరగనున్న పార్టీ ప్రతినిధుల సభను పరిశీలించారు.
అనంతరం వరంగల్ మహానగర కార్పొరేషన్ ఆవరణలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నర్సంపేటలో జరిగే కార్యక్రమాల స్థలాలు మున్సిపాలిటీ, మెఘా పిఎన్‌జి ప్లాంట్, సభా ప్రాంగణం, హెలీ ప్యాడ్‌లను పరిశీలించారు. అనంతరం వేర్వేరుగా హన్మకొండ, నర్సంపేటల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డిలు మాట్లాడారు.