అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుతో పాటు యానాంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. నేడు సైతం తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా.. పిడుగులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా చోట్ల మాత్రం ఎండలు మండిపోతాయి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే ప్రజలు రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలని అధికారులు సూచించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు (Rains In Andhra Pradesh)
ఏపీలో నేడు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాం ప్రాంతాల్లో నేడు తేలికపాటి జల్లులు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖ ఏజెన్సీలో సాధారణ వర్షాలు రుస్తున్నాయి. రంపచోడవరం, భద్రాద్రి వైపుగా విస్తరిస్తున్నాయి. మారేడుమిల్లి - రంపచోడవరం పరిధిలో, దిగువన ఉన్న ఏలూరు జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీ కొండ ప్రాంటల్లో ముఖ్యంగా పాడేరు-చింతపల్లి-అరకు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
విజయవాడ నగరంలో అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు పడతాయి. తణుకు, తాడేపల్లిగూడం, భీమడోలు వైపుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజమండ్రి, యానం, కొనసీమ ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు దిగొస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాల కింద, చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా దోర్నాల పరిసర ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి.
రాయలసీమలో తేలికపాటి జల్లులు (Rains In Rayalaseema)
అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలో ఉరుములతో కూడిన వర్షాలున్నాయి. నేరుగా కల్యాణదుర్గం - రాయదుర్గం వైపుగా వర్షాలు విస్తరిస్తున్నాయి. దీని వల్ల పశ్చిమ అనంతపురంలో ఈదురుగాలులు, వర్షాలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపున కదిరి తూర్పు పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉంది. నంద్యాలతో పాటు అనంతపురం జిల్లా ఉత్తరభాగాలు తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి వైపుగా గాలులు వీచడంతో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో, ఆధోని పరిసరాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో కొన్నిచోట్ల చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలో వర్షాలు (Rains In Telangana)
తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో కప్పి ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వికారాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నేటి రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మరింత ఎక్కువ కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ దిశ, నైరుతి దిశ నుంచి గాలులు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి.