ఐపీఎల్‌ 2022లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐదో విజయం అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఆల్‌రౌండర్లతో కూడిన లక్నోను 163/8కి పరిమితం చేసింది. 18 పరుగుల తేడాతో గెలిచి రెండో ప్లేస్‌కు చేరుకుంది. కృనాల్‌ పాండ్య (42; 28 బంతుల్లో 5x4, 2x6), కేఎల్‌ రాహుల్‌ (30; 24 బంతుల్లో 3x4, 1x6) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు ఆర్సీబీలో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (96; 64 బంతుల్లో 11x4, 2x6) దంచికొట్టాడు. షాబాజ్‌ అహ్మద్‌ (26; 22 బంతుల్లో 1x4) అతడికి అండగా నిలిచాడు.


బెంగళూరు బౌలింగ్‌ సూపర్‌


భారీ ఛేదనకు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కోరుకున్న ఆరంభం దక్కలేదు. జట్టు స్కోరు 17 వద్ద డికాక్‌ (3), 33 వద్ద మనీశ్‌ పాండే (6) ఔటయ్యారు. కాసేపు అలరించిన కేఎల్‌ రాహుల్‌ (30; 24 బంతుల్లో 3x4, 1x6)ను 64 వద్ద హర్షల్‌ పెవిలియన్‌ పంపించాడు. అయితే కృనాల్‌ పాండ్య (42; 28 బంతుల్లో 5x4, 2x6), దీపక్‌ హుడా (13) చక్కని ఇన్నింగ్స్‌ నిర్మించారు. రన్‌రేట్‌ను అదుపులో పెడుతూ షాట్లు బాదారు. నాలుగో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ 8 పరుగుల వ్యవధిలో ఔటవ్వడంతో టెన్షన్‌ పెరిగింది.  మార్కస్‌ స్టాయినిస్‌ (24; 15 బంతుల్లో 2x4, 1x6) గెలిపిస్తాడనిపించినా 18.2వ బంతికి అతడిని హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. జేసన్‌ హోల్డర్‌ (16) ఒకట్రెండు సిక్సర్లు కొట్టినా ఫలితం లేకుండా పోయింది. జోష్‌ హేజిల్‌వుడ్‌ (4/25), హర్షల్‌ పటేల్‌ (2/47) బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు.


డుప్లెసిస్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌


టాస్‌ ఓడిన ఆర్‌సీబీకి శుభారంభం దక్కలేదు. పవర్‌ప్లే ముగిసే సరికే 3 వికెట్లు నష్టపోయి 47 పరుగులు చేసింది. మాక్స్‌వెల్‌ (23; 11 బంతుల్లో 3x4, 1x6) విధ్వంసకరంగా ఆడటంతో ఆ స్కోరు వచ్చింది. జట్టు స్కోరు 44 వద్ద అతడిని కృనాల్‌ పాండ్య ఔట్‌ చేశాడు. అంతకు ముందే ఓపెనర్‌ అనుజ్‌ రావత్‌ (4), విరాట్‌ కోహ్లీ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. ఇబ్బందుల్లో పడ్డ జట్టును షాబాజ్‌ అహ్మద్‌ (26; 22 బంతుల్లో 1x4)తో కలిసి కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఆదుకున్నాడు. ఐదో వికెట్‌కు 48 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 40 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. సాఫ్ట్‌ హ్యాండ్స్‌తో చక్కని బౌండరీలు బాదాడు. జట్టు స్కోరు 132 వద్ద షాబాజ్‌ ఔటైనా ఆరో వికెట్‌కు డీకే (13*)తో కలిసి 27 బంతుల్లో 49 భాగస్వామ్యం అందించాడు. సెంచరీకి చేరువైన అతడిని 19.5వ బంతికి హోల్డర్‌ ఔట్‌ చేయడంతో స్కోరు 181/6కు చేరుకుంది.