IPL 2022 AB de Villiers Awestruck By Mr 360 Dinesh Karthik: ఐపీఎల్ 2022లో సూపర్ ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి ఫినిషింగ్ టచ్ అద్భుతంగా అనిపిస్తోందని పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ వయసులో అతడిలా ఆడుతోంటే మళ్లీ తనకు క్రికెట్ ఆడాలనిపిస్తోందని మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అంటున్నాడు.
'దినేశ్ కార్తీక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే అతడు ఆర్‌సీబీని 2-3 మ్యాచుల్లో గెలిపించాడు. అతడు జీవితంలోనే అత్యుత్తమమైన ఫామ్‌లో ఉన్నట్టు అనిపిస్తోంది. ఎక్కువ క్రికెట్ ఆడకున్నా అతడిలాంటి ఫామ్ ఎలా వచ్చిందో తెలియడం లేదు. కానీ ఆటతీరుతో సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. 360 డిగ్రీల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు' అని ఏబీ డివిలియర్స్ అన్నాడు.
'డీకేను చూస్తుంటే నాకూ మళ్లీ క్రికెట్ ఆడాలని అనిపిస్తోంది. అతడి బ్యాటింగ్‌ను దగ్గరుండి చూడాలనిపిస్తోంది. అతడి ఆట నన్ను ఉత్సాహపరుస్తోంది. మిడిలార్డర్లో ఎంతో ప్రెజర్లో అతడు ఆడుతున్నాడు. తన అనుభవం చూపిస్తున్నాడు. అతడిలాగే ఫామ్ కొనసాగిస్తే ఆర్‌సీబీకి కచ్చితంగా ఛాన్స్ ఉంటుంది' అని ఏబీ అన్నాడు.
ఏబీ డివిలియర్స్ సుదీర్ఘకాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సేవలు అందించిన సంగతి తెలిసిందే. దాదాపుగా అతడి పాత్రను ఇప్పుడు డీకే పోషిస్తున్నాడు. జట్టును ఆపదల నుంచి రక్షిస్తున్నాడు. ఈ సీజన్లో ఆరు ఇన్నింగ్సుల్లోనే 210 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 197 పరుగులు చేశాడు. అదీ ఐదు, ఆరు స్థానాల్లో వస్తూ చేయడం ప్రత్యేకం. అందుకే డీకే ఆటను చూసి చాలామంది సీనియర్ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అతడిని ఎంపిక చేసిన ఆశ్చర్యం లేదని సునిల్ గావస్కర్ అంటున్నాడు.
ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్తగా కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దినేశ్ కార్తీక్ ఫినిషింగ్‌తో అవి బయటపడటం లేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచులాడిన ఆర్‌సీబీ నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో ఉంది.