తెలంగాణలో రాజకీయాలపై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. తెలంగాణలో అసలు శాంతి భద్రతలు అదుపు తప్పాయని సీరియస్ కామెంట్స్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలని సూచించారామె. 


గవర్నర్‌కే దిక్కులేదు


తెలంగాణలో ఎలాంటి ప్రోటోకాల్‌ లేదూ... ప్రొసీజర్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రేణుకా చౌదరి. గవర్నర్‌ లాంటి వ్యక్తి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే సెక్యూరిటీ కూడా ఉండదా అని ప్రశ్నించారామె. ఐఏఎస్, ఐపీఎస్‌లకు రాజకీయాలకు ఏ సంబంధమని నిలదీశారు. ప్రజాప్రతినిధులు రాకపోతే.. కనీసం అధికారులైనా రావాలి కదా అని ఆశ్చర్య వ్యక్తం చేశారు. గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలో గౌరవప్రదమైన హోదా అని దానికే గౌరవం ఇవ్వకుంటే పాలన ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇదేనా పరిపానా విధామని మండిపడ్డారు. 


అది పెద్ద గొప్పేమీ కాదు


మహిళా గవర్నర్ మీద అసభ్యంగా పోస్టులు పెట్టడం మొగతనం కాదన్నారు రేణుకా చౌదరి. కుసంస్కారంతో చేస్తున్న పనులు ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఏ మహిళ గురించి ఏ పార్టీ నాయకులు మాట్లాడినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తామేంటో చూపిస్తామన్నారు. 


పువ్వాడ దందా


ఖమ్మంలో సామాన్యులపై పీడీ యాక్టు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేణుకా చౌదరి. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏసీపీ తప్పుడు స్టేచ్‌మెంట్‌లు ఇస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకుంటే ఏసీపీకి సంబంధం లేదా ఆని నిలదీశారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసు లో పువ్వాడ అజయ్ A 1 నిందితుడని ఏసీపీ కూడా నిందితుడేనన్నారు. 


అమిత్‌షా రియాక్ట్ అవ్వాలి


ఇన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధించారని.. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలపై పడ్డారని ఆరోపించారు రేణుకా చౌదరి. ఇప్పటికైనా అమిత్‌షా స్పందించి కేసులు పెట్టించండని సూచించారు. బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టించుకోరా అని నిలదీశారు. చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.  పువ్వాడ అజయ్‌కి కేటీఆర్‌కి వ్యాపార సంబంధాలు ఉన్నాయని అందుకే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారామె. 


పొత్తులపై స్పందించిన రేణుకా చౌదరి... తమ పార్టీకి కూడా పొత్తులపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నారు. తమ కార్యకర్తలు కూడా టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఎంత దూరంగా ఉంటే తమ పార్టీకి అంత మంచిదన్నారు. 


కమ్మ సామాజిక వర్గాన్ని అన్ని చోట్ల తొక్కేస్తున్నారన్న రేణుకా చౌదరి... అవసరం మేరకే వారితో పనిచేస్తున్నారని మండిపడ్డారు. అవసరం తీరిపోయిన తర్వాత వారిని తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కాదు కమ్మరావతిని అన్న సీఎం దమ్ముంటే ఆ పేరు పెట్టాలని సవాల్ చేశారు.