సాధారణ బాదం పప్పుతో పోలిస్తే రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం పలుకులు తినడం వల్ల లాభాలు ఎక్కువ అని చెబుతారు పెద్దలు. అది ఎంత వరకు నిజమో తెలియకపోయినా పాటించే వారూ ఉన్నారు. అయితే ముడి బాదం పలుకులతో పోలిస్తే, నీటిలో నానబెట్టిన బాదంతో లాభాలు ఎక్కువనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలా లాభమో తగిన కారణాలతో సహా వివరిస్తున్నారు. 


ఎన్ని లాభాలో...
బాదం పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో మన శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, రాగి ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ బరువు తగ్గడానికి, ఎముకల ఆరోగ్యానికి, మానసిక స్థిమిత్వానికి, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడతాయి. వీటిలోని పోషకాల శక్తి మరింత పెరగాలంటే బాదం పలుకులను నానబెట్టి తినాల్సిందే. 


1. పచ్చి  బాదంతో పోలిస్తే నానబెట్టిన బాదం పలుకులు త్వరగా జీర్ణం అవుతాయి. ఇలా నానబెట్టింది ఏదైనా జీర్ణ వ్యవస్థలో త్వరగా విచ్ఛిన్నం అయ్యి శక్తిగా మారి శోషించబడుతుంది. 


2. నానిన బాదంపలుకులలో పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ప్రయోజనాలు పెరుగుతాయి. నానబెట్టడం వల్ల కొన్ని మలినాలు కూడా తొలగిపోతాయి. 


3. నానబెట్టిన బాదం లిపేస్ వంటి ఎంజైమ్లను విడుదల చేస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. అంతేకాదు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహార మెనూలో  బాదం పలుకులను కూడా చేర్చుకోండి. 


4. బాదం నానబెట్టినప్పుడు అందులోని ఫైటిక్ ఆమ్లం తొలగిపోతుంది. ఇది శరీరంలో పోషకాల శోషణకు అడ్డుపడే ఆమ్లం. ఇది తొలగిపోతే బాదంలోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. అందుకే  పచ్చిగా తిన్నప్పుడు బాదంలోని ఇనుము, జింకు వంటి పోషకాలు శరీరం శోషించుకునే అవకాశాలు తక్కువ. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: కాఫీ అధికంగా తాగుతున్నారా... ఆల్కహాల్ కంటే ప్రమాదం


Also read: పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత ఆరోగ్యమో


Also read: పిల్లలకు తీపి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత మంచిది, లేకుంటే పెద్దయ్యాక కష్టాలే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి