ప్రపంచంలో అత్యధికులకు ఇష్టమైన పానీయం కాఫీనే. అలసట లేకుండా పనిచేయాలన్నా, ఉత్సాహం, ఉత్తేజంగా ఉండాలన్నా కాఫీని సేవించాల్సిందే. ముఖ్యంగా నైట్ షిప్టు లో పనిచేసేవారికి కాఫీ చాలా సహాయకారి. అయితే చాలా మంది కాఫీని ఎప్పుడుపడితే అప్పుడు కప్పులు కప్పులు లాగించేస్తారు. దీని వల్ల మాత్రం చాలా ప్రతికూల ప్రభావాలు పడతాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. కాఫీని అధికమొత్తంలో తాగడం వల్ల అది చేసే మేలు తక్కువై, కీడే ఎక్కువవుతుంది. ఇది ఆల్కాహాల్ కన్నా హానికరం కావచ్చు. అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని అంటున్నారు వైద్యులు. 


కాఫీ అధికంగా తాగితే కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవిగో...


1. ఆందోళన పెరుగుతుంది
కాఫీ అధికంగా తాగేవారిలో మానసిక ఆందోళన పెరుగుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ శరీరంలో చురుకుదనాన్ని, ఉత్తేజాన్ని పెంచుతుంది. ఇది నియంత్రణలో ఉన్నంత మేరకు ఆరోగ్యానికి మంచిదే. అధికంగా కెఫీన్ ఒంట్లో చేరడం వల్ల మెదడులో ఉండే అడెనోసిన్ అనే రసాయనాన్ని అడ్డుకుంటుంది. దీని వల్ల  మీకు అలసటగా అనిపిస్తుంది. ఆందోళన పెరుగుతుంది. 


2. నిద్రలేమి
రాత్రి షిప్టుల్లో పనిచేసేవారు సాయంత్రం ఒక కాఫీ తాగితే చాలు, రాత్రి నిద్రరాకుండా పనిచేసుకోగలరు. అలాంటిది ఉదయం నుంచి ఆరేడు కప్పుల కాఫీ తాగే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? రాత్రిపూట నిద్ర సరిగా పట్టక పోవడం వల్ల, కొన్నాళ్లకు అది ఇన్సోమ్నియాగా మారిపోతుంది. కాఫీ నిద్ర షెడ్యూల్ మొత్తాన్ని డిస్ట్రబ్ చేస్తుంది. 


3. వ్యసనంగా మారిపోతుంది
ఏదైనా వ్యసనంగా మారితే దాని వల్లే నష్టమే. రోజూ అయిదారు కప్పులు మించి కాఫీ తాగే వాళ్లలో కొన్నాళ్లకి ఇది ఆల్కహాల్ లాగే భయంకరమైన వ్యసనంగా మారిపోతుంది. ఇక కాఫీ తాగకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాఫీలో ఉండే కెఫీన్ ఒకరకమైన కొకైన్ లాంటిదే. ఇది మెదడు రసాయనాలను తీవ్రంగా వశపరచుకుని, వ్యసనంగా మార్చేస్తుంది. 


4. అలసట
ఖాళీ కడుపుతో పరగడుపునే కాఫీ తాగడం మంచిది కాదు. ఇది యాసిడ్ రిఫ్లెక్స్ ను ప్రేరేపిస్తుంది. కెఫీన్ శక్తినిస్తుందన్నది నిజమే కానీ, అధికమొత్తంలో చేరిన కెఫీన్ అలసటకు కారణమవుతుంది. 


రోజుకు ఎన్నికప్పులు?
కాఫీ రోజుకు రెండు కప్పులకు మించి తాగకపోవడం మంచిది. ఈ రెండు కప్పులు చాలు మీకు ఉత్సాహాన్నివ్వడానికి. ముఖ్యంగా మధ్యాహ్నం మూడు దాటాక కాఫీ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఇది కొందరిలో నిద్రను దూరం చేస్తుంది. అర్థరాత్రి దాకా మేల్కొనేలా చేస్తుంది.  


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు. 


Also read: పెరుగుతో పాటూ వీటిని తింటే... ఎంత ఆరోగ్యమో


Also read: మనీ ప్లాంట్ లేదా కాయిన్ ప్లాంట్... రెండింటిలో ఏది పెంచితే మీ ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి