రవితేజ డబుల్ ఇంపాక్ట్: 

ఈ మధ్యనే రవితేజ-త్రినాధరావు నక్కిన సినిమా సెట్స్ పైకి వచ్చింది. అసలు ఈ సినిమా సెట్ అవుతుందా లేదా అనే అనుమానాల మధ్య ఇప్పుడు షూటింగ్ మోడ్ లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ లుక్, టైటిల్ కూడా రిలీజ్ చేశారు. దసరా కానుకగా ఈ సినిమాకి 'ధమాకా' అనే టైటిల్ పెట్టినట్లు అనౌన్స్ చేశారు. ఈ లుక్ లో రవితేజ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. మాస్-క్లాస్ రెండు ఎలిమెంట్స్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి దానికి కారణం ఈ సినిమాకు డబుల్ ఇంపాక్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టడమే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ-మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా పెళ్లిసందD ఫేమ్ శ్రీలీల ను తీసుకున్నట్టు తెలుస్తోంది.  

ఆడవాళ్లు మీకు జోహార్లు ఫస్ట్ లుక్.. 

దసరా కానుకగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రష్మిక, శర్వా ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. రీసెంట్ గా 'మహాసముద్రం' సినిమాతో ప్రేక్షకులను అలరించిన శర్వా ఇప్పుడు కొత్త పోస్టర్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఈ సినిమాలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. 

'భోళాశంకర్' అప్డేట్: 

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో 'భోళాశంకర్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. దసరా సందర్భంగా ఈ సినిమాకి మహతి సంగీత దర్శకుడిగా పనిచేయనున్న విషయాన్ని వెల్లడించారు.