రోజురోజుకు క్యాన్సర్లు చాలా పెరిగిపోతున్నాయి. అయితే క్యాన్సర్లలో చాలా వరకు సమయానికి గుర్తించి చికిత్స అందించినపుడు పూర్తిగా నయమవుతాయి. అయితే ఏది క్యాన్సర్ వ్యాధి లక్షణాలు చాలా సార్లు ఇతర వ్యాధులను పోలి ఉండడం వల్ల నిర్దారణకు సమయం పడుతోంది. అందువల్ల చికిత్సలో జాప్యం జరుగుతోంది. ఈ జాప్యం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఇలాంటి జాప్యాన్ని నివారించేందకు క్యాన్సర్ ను త్వరగా గుర్తించే విధంగా డిజిటల్ టెక్నాలజిని అందుబాటులోకి తెస్తున్నారు. ట్రైల్స్‌లో మంచి ఫలితాలిస్తున్న ఈ టెక్నాలజీ స్కిన్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు.
మీ ఫోన్ కెమేరాతోనే పరీక్షించుకోవచ్చు
ఈ మధ్య ఫోన్లలో కూడా మైక్రోస్కోప్ కెమేరాలు కూడా వస్తున్నాయి. వాటితో చర్మ క్యాన్సర్లను గుర్తించడం చాలా సులభమట? ఎందుకంటే, ఇటీవల వైద్యులు.. చర్మం మీద అనుమానస్పద గుర్తులు లేదా పుట్టుమచ్చలు కలిగిన సుమారు పదివేల మందికి డెర్మటోస్కోప్ ద్వారా స్కాన్ చేసి పరీక్షలు జరిపారట. ఈ డెర్మటోస్కోప్.. స్మార్ట్ ఫోన్ కెమేరాలో ఉండే 50p పరిమాణం మైక్రోస్కోప్ లెన్స్ తరహాలోనే పనిచేస్తుందట. కాబట్టి, మీ ఫోన్లో అలాంటి కెమేరా ఉంటే భవిష్యత్తులో మీరు పదే పదే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవల్సిన అవసరం కూడా ఉండదు.
600,000 మందికి గత సంవత్సరం చర్మ క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించగా వారిలో 56000 మందికి చికిత్స అవసరం ఉన్నట్లు తేలింది. అయితే జులై నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్త పరీక్షా విధానం వల్ల ఒక రోజులో రెట్టింపు పరీక్షలు చెయ్యడం సాధ్యమవుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రెఫరల్స్ సమయం ఆదా కావడమే కాకుండా వెయిటింగ్ లిస్ట్ లు కూడా తగ్గించి చికిత్స వేగంగా అందించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.
డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల వెయిటింగ్ సమయం తగ్గి చాలా మందికి సమయానికి చికిత్స ప్రారంభించడం సాధ్య పడుతుందనే ఆశాభావాన్ని వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో చర్మ క్యాన్సర్లు చాలా సాధారణం. సమయానికి గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నయం చెయ్యడం కూడా సాధ్యమే. అయితే, సమయం మించితే మాత్రం ప్రాణాంతకంగా మారవచ్చు.
మెలనోమాతో ప్రతి సంవత్సరం 2,400 మంది మరణిస్తున్నారు. దీని ప్రధాన లక్షణాల్లో ఒకటి పుట్టుమచ్చ వంటి చిన్న మచ్చ ఏర్పడడం. దాని ఆకారం, పరిమాణం, రంగు లేదా ఆకృతి మారుతుండడం, కొన్ని సార్లు రక్త స్రావం కూడా ఉండొచ్చు. ప్రతి పది మంది మైలోమా పేషెంట్లలో తొమ్మిది మందికి పూర్తిగా చికిత్స అందించి కాపాడవచ్చు. అయితే, క్యాన్సర్ ఇతర బాగాలకు వ్యాపించడానికి ముందే గుర్తించి.. చికిత్స అందించడం మాత్రమే. మారుమూల ప్రాంతాల్లోని రోగులకు కూడా త్వరగా యాక్సెస్ పొందేందుకు వీలుగా డెర్మటోస్కోప్ లు అందుబాటులోకి తీసుకురావాలి.
అయితే, మనకు మనకే స్మార్ట్ ఫోన్ల ద్వారా చర్మ క్యాన్సర్ మచ్చలను ఎలా గుర్తించాలి? అవి ప్రమాదకరమా, కాదా అనేది తెలుసుకోవడం ఎలా అనేది ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఇలాంటి కెమేరా గ్యాడ్జెట్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో అవి అందరికీ అందుబాటులోకి వస్తే.. డాక్టర్లు, హాస్పిటళ్లకు వెళ్లకుండానే.. ఇంట్లోనే పరీక్షలు చేసుకోవచ్చు. కాబట్టి.. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.
Also read : ఓ మై గాడ్, ఈ ఫుడ్‌లో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.