ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టంట్ ఆహార పదార్థాల వినియోగం చాలా పెరిగిపోయింది. ఫూడ్ ఇండస్ట్రీ కూడా చాలా పెరిగిపోయింది. అయితే ఐదు లేదా అంతకంటే ఎక్కువ రసాయనాలు కలిగి ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ ఫూడ్ లో ఉప్పు, కొవ్వులు, చక్కెరలు మోతాదుకు మించే ఉంటాయి. వీటితోపాటు కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు. చాలా కాలంగా వీటిలో వాడే రసాయనాలకు సంబంధించిన వివాదాలు, వాదనలు చర్చల్లో ఉంటూనే ఉన్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫూడ్ వాడేవారు పూర్తి జనాభాలో 50 శాతం వరకు ఉన్నారట. అందుకే ఈ మధ్య కాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. బీబీసి పానోరమ డాక్యుమెంటరీ పరిశోధనలో స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులకు కారణమయ్యే ఆహారపదార్థాల జాబితాలో కనిపించే రెండు పదార్థాల గురించి ప్రస్తావించింది.


ఎమెల్సీఫైయర్స్


ఎమల్సీఫైయర్స్ చాలా రకాల అల్ట్రా ప్రాసెస్డ్ ఫూడ్ లో కనిపిస్తాయి. వీటిని పదార్థాల్లోని అన్ని ఇన్గ్రీడియెంట్స్ ని కలిపి ఉంచే బైండర్లుగా వాడుతారు. ఆకారం, రూపం మెరుగ్గా కనిపించేందుకు ఇవి అవసరం. తక్కువగా ప్రాసెస్ చేసిన పదార్థాల్లో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.


ఫ్రెంచ్ పరిశోధకులు నిర్వహించిన కొత్త అధ్యయనంలో ఎమల్సిఫైయర్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చట. అంతేకాదు గుండె సంబంధ సమస్యలకు కూడా కారణం కావచ్చని అంటున్నారు. యూనివర్సిటి సోర్బోన్ పారిస్ నోర్డ్ వారు నిర్వహించిన ఈ పరిశోధనను పూర్తిగా సమీక్షించాల్సి ఉందట.


ప్యాక్ మీద ఉండే ఇన్గ్రీడియెంట్స్ లో ఇవి గమనించండి


మోడ్రన్ ప్యాక్డ్ ఫూడ్ ఎమల్సిఫయర్లలో ఆవాలు, సోయా, ఎగ్ లెసిథిన్, మోనో అండ్ డైగ్లిజరైడ్స్, పాలీ సోర్బేట్స్, క్యారేజినన్, గ్వార్ గమ్, కనోలా ఆయిల్ వంటివి ఉన్నాయి.


ఎమల్సిఫైయర్లు ఎందులో ఉంటాయి?


తక్కువ కొవ్వు కలిగిన స్ప్రెడ్స్, ఐస్ క్రీం, వనస్పతి, సలాడ్ డ్రెసింగ్స్, పీనట్ బటర్, చాక్లెట్లలో ఎక్కువగా వీటిని వాడుతున్నారు.


ఆస్పార్టమే


ఆస్పార్టమే తక్కువ కాలరీలు కలిగిన ఆర్టిఫిషియల్ స్వీటనర్. చాలా రకాల డైట్ డ్రింక్స్ లో, ఆహార పదార్థాల్లో వాడుతుంటారు. అయితే ఈ స్వీటనర్ చాలా పాపులర్. చాలా మంది వినియోగిస్తున్నారు కూడా. కానీ దీని వినియోగం వల్ల చాలారకాల అనారోగ్యాలు కలుగవచ్చట.


ఇంకా ఇది ప్రమాదకరం అని నిర్ధారణ కానప్పటికీ దీర్ఘకాలికంగా దీనిని వినియోగించడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యలకు కారణం కావచ్చని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫూడ్ తీసుకుంటున్నపుడు ప్యాక్ మీద ఆస్పర్టమే ఉందేమో చూడాలి. ప్రాసెస్డ్ తృణధాన్యాలు, ప్రోజెన్ డిజర్ట్స్, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్, డైట్ ఫిజీ పానీయాలు, ఇన్స్టంట్ కాఫీల్లో ఆస్పార్టమే ఉంటుంది.


Also read : Vitamin C: మీ శరీరానికి ‘విటమిన్ C’ ఎంత ముఖ్యమో తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.