రోజు వారీ పనులు నిర్వర్తించాలన్నా, జీవక్రియలన్నీ సజావుగా సాగాలన్నా శరీరానికి పోషకాలు అవసరమవుతాయి. రోగనిరోధకత స్థిరంగా ఉంచడం, ఎముకలు బలంగా ఉండడం వంటి వన్నీ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇందుకు దోషదం చేసే సూక్ష్మపోషకం విటమిన్ సి. ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోవడానికి, దీర్ఘకాలిక ఆరోగ్యానికి అవసరమైన పోషకం విటమన్ సి. మన శరీర నిర్మాణం చాలా సంక్లిష్టం. ఒక్క పోషక లోపం ఏర్పడినా అది మిగతా పోషకాల లోపానికి, ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంది. కనుక పోషకాహార లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఒక వేళ లోపం ఏర్పడితే సరైన సమయంలో చికిత్స తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.


జలుబు


సీజన్ మారగానే తప్పకుండా వచ్చే ఫ్లూ, సాధారణ జలుబు నుంచి త్వరగా కోలుకోవాలంటే విటమిన్ సి తగినంత ఉండడం అవసరం. రోగనిరోధక శక్తి బలంగా ఉండేందుకు విటమిన్ సి చాలా అవసరం. ఫ్లూ, జలుబు, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. డయాబెట్స్, బీపీ వంటి అంటువ్యాధులు కానీ జబ్బులతో బాధ పడేవారికి కూడా  విటమిన్ సి తగినంత ఉండడం అవసరం. ఓవరాల్ హెల్త్ కోసం విటమిన్ సి తగినంత ఉండాలి.


డయాబెట్స్


రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో, లిపిడ్ ప్రొఫైల్ మెరుగు పరచడంలో విటమిన్ సి చాలా సహాయ పడుతుంది. ఆక్సిడెషన్ ప్రెషర్ కూడా శరీరం మీద ప్రభావం చూపకుండా నిరోధిస్తుంది.


గుండె సమస్యలు


కరోనరీ ఆర్టరీ డిసీజ్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది విటమిన్ సి. బీపీ, కొలేస్ట్రాల్ తో బాధపడే వారిలో విటమిన్ సి లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడడం అవసరం. విటమిన్ సి రక్తనాళాల ఎండోథెలియల్ పనితీరును మెరుగు పరుస్తుంది. ఫలితంగా రక్తం చిక్కబడకుండా నివారించబడుతుంది.


రక్తహీనత


విటమిన్ సి తగినంత లేకపోతే శరీరం ఆహారం నుంచి ఐరన్ గ్రహించలేదు. ఫలితంగా రక్తహీనత కు కారణం కావచ్చు. రక్త హీనత ఉన్నవారిలో విటమిన్ సి స్థాయిలను కూడా పరీక్షించి విటమిన్ సి లోపాన్ని సవరించాల్సి ఉంటుంది.


విటమిన్ సి గాయాలను నయం చెయ్యడానికి, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని రక్షణ వ్యవస్థను బలోపేతం చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.


విటమిన్ సి న్యూమోనియా వంటి సీరియస్ ఇన్ఫెక్షన్లలో హాస్పిటల్ లో ఉండే వ్యవధి తగ్గిస్తుంది. పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా లోపం ఏర్పడకుండా నివారించవచ్చు. ఒకసారి లోపం ఏర్పడితే మాత్రం వైద్య సలహా మేరకు సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. అయితే సప్లిమెంట్లు వాడడానికి ముందు కచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి. తగిన మోతాదులో తీసుకునేందుకు వారి సలహా ఉపయోగపడుతుంది.


Also read : పిక్క బలం పెరిగితే గుండె బలం తగ్గుతుందా? కొత్త పరిశోధనలో ఏం తేలింది?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.