Apple Vision Pro: మోస్ట్ అవైటెడ్ యాపిల్ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను WWDC 2023లో యాపిల్ లాంచ్ చేసింది. యాపిల్ లాంచ్ చేసిన మొదటి మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ ఇదే. ఇందులో హై రిజల్యూషన్ డిస్‌ప్లేలు అందించనున్నారు. మన కళ్లతో, వాయిస్‌తో దీన్ని కంట్రోల్ చేయవచ్చు. దీంతోపాటు ఇందులో బోలెడన్ని సెన్సార్లు ఉండనున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్) రెండిటినీ ఇది సపోర్ట్ చేయనుంది. ఈ హెడ్‌సెట్‌లో కెమెరాలు కూడా ఉండనున్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్ బ్యాటరీ ఉండదు. దాన్ని సపరేట్‌గా అందిస్తారు.
ఇవి చూడటానికి అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ డిస్‌ప్లే ఉన్న స్కీ గూగుల్స్ తరహాలో ఉంటాయి. ఫ్యాబ్రిక్ లైన్డ్ మాస్క్, స్ట్రాప్‌ను కూడా దీంతోపాటు అందించనున్నారు. దీని బ్యాటరీ ప్యాక్‌ను డివైస్ ఎడమవైపు కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని మన కంటి చూపుతో కంట్రోల్ చేయవచ్చని యాపిల్ తెలిపింది. దీనికి డిస్‌ప్లే పైన ఉన్న గ్రాఫిక్ ఎలిమెంట్స్‌ను చూడాలి. ఐ సైట్ అనే ఫీచర్ ద్వారా తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా వినియోగదారులు తెలుసుకోవచ్చు. కుడివైపు ఉండే డయల్ ద్వారా ఏఆర్, వీఆర్ మోడ్లను మార్చుకోవచ్చు.
యాపిల్ విజన్ ప్రో ధర
అమెరికాలో దీని ధర 3,499 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో రూ.2,88,700) నిర్ణయించారు. యాపిల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది విక్రయానికి రానుంది. యాపిల్ స్టోర్లలో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో, ధర ఎంతగా ఉండనుందో తెలియరాలేదు.
యాపిల్ విజన్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
యాపిల్ విజన్ ప్రో మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్లో రెండు మైక్రో ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉండనున్నాయి. 23 మిలియన్ పిక్సెల్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. కస్టం 3డీ లెన్స్ ద్వారా ఏఆర్ కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. హై స్పీడ్ ప్రధాన కెమెరాలు ఉన్న ఫుల్ సెన్సార్లు, హ్యాండ్ ట్రాకింగ్ కోసం కింద వైపు కెమెరాలు, ఐఆర్ ఇల్యూమినేటర్లు, సైడ్ కెమెరాలు ఇందులో అందించనున్నారు. హ్యాండ్ ట్రాకింగ్ కోసం, డివైస్ కింద స్పేస్ కోసం ప్రత్యేకంగా లిడార్ స్కానర్, ట్రూడెప్త్ కెమెరాలు ఉండనున్నాయి. రెండు ప్రత్యేకమైన యాంప్లిఫైడ్ డ్రైవర్స్ ద్వారా స్పేషియల్ ఆడియో అందించనున్నట్లు యాపిల్ తెలిపింది.
యాపిల్ పవర్ ఫుల్ ఎం2 చిప్, ఆర్1 చిప్‌ల ద్వారా ఈ హెడ్ సెట్ పని చేయనుంది. ఇది 12 కెమెరాలు, ఐదు సెన్సార్లు, ఆరు మైక్రో ఫోన్లను సపోర్ట్ చేస్తుందని యాపిల్ తెలిపింది. కంటికి సైట్ ఉన్న యూజర్లు కూడా దీన్ని ఉపయోగించేందుకు జీస్ ఆప్టికల్ ఇన్‌సెర్ట్స్‌ను అందించారు.
వినియోగదారుల ఐరిస్‌ను గుర్తించేలా ఇందులో ఆప్టిక్ ఐడీ ఫీచర్‌ను కూడా అందించారు. ఐఫోన్‌ను ఫేస్ ఐడీతో అన్‌లాక్ చేస్తే మాత్రమే ఎలా ఉపయోగించగలమో, ఈ డివైస్‌ను ఆప్టిక్ ఐడీతో అన్‌లాక్ చేస్తే మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ హెడ్‌సెట్ విజన్ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. రియల్ టైమ్ సబ్ సిస్టం, స్పేషియల్ ఆడియో ఇంజిన్, మల్టీ యాప్ 3డీ ఇంజిన్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
ఏఆర్‌ను సపోర్ట్ చేసే కంటెంట్ క్రియేట్ చేయడానికి యాపిల్... డిస్నీతో ఒప్పందం కుదుర్చుకుంది. జూమ్, సిస్కో వెబ్ఎక్స్, అడోబ్ లైట్ రూం, మైక్రోసాఫ్ట్, వర్డ్, ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Read Also: వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై మీ స్క్రీన్ ఇతరులకు షేర్ చెయ్యొచ్చు!