మెటా యాజమాన్యంలోని మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. భారత్ లో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉంది. ఈ యాప్ ద్వారా చాలా మంది తమ తమ పనులను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు మెరుగైన ఫీచర్లను తీసుకురావడంలో ముందుంటుంది. మరింత సులభంగా వాట్సాప్ వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తోంది.
ఇకపై వాట్సాప్ నుంచి స్క్రీన్ షేర్ ఆప్షన్
వాట్సాప్ తన వినియోగదారులకు మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులకు అద్భుతమైన వీడియో కాలింగ్ అనుభవాన్ని అందించబోతోంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్ ను పూర్తి స్థాయిలో టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, వినియోగదారులు వీడియో కాల్ మాట్లాడే సమయంలో తమ మొబైల్ స్క్రీన్ ను ఇతరులకు షేర్ చేసే అవకాశాన్ని కల్పించబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.11.19 బీటాను ఇన్ స్టాల్ చేసుకున్న ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉందని వెల్లడించింది. త్వరలో ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్స్ అందరికీ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపింది.
వాట్సాప్ స్క్రీన్ షేర్ ఎలా చేసుకోవాలంటే?
వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రకారం వినియోగదారులు వీడియో కాల్ చేసిన సమయంలో కాల్ కంట్రోల్ వ్యూలో కొత్త ఐకాన్ కనిపిస్తుంది. ఇది స్క్రీన్ షేర్ చేయడానికి యూజ్ అవుతుందని వాట్సాప్ వెల్లడించింది.ఒక్కసారి వినియోగదారులు స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత, వారి స్క్రీన్ పై ఉన్న కంటెంట్ మొత్తం రికార్డు అవ్వడంతో పాటు మీరు వీడియో కాల్ చేసిన వారికి షేర్ చేయబడుతుందని తెలిపింది. అయితే, ఈ సరికొత్త ఫీచర్ పై వినియోగదారులకు పూర్తి స్థాయిలో కంట్రోల్ ఉంటుందని, స్క్రీన్ షేర్ చేసిన సమయంలో స్క్రీన్ పైన ఉన్న కంటెంట్ రికార్డు అవుతున్నప్పటికీ, వినియోగదారులు కావాల్సినప్పుడు దానిని నిలిపివేసే అవకాశం ఉంటుందని వివరించింది. అటు వినియోగదారులు తమ స్క్రీన్ రికార్డింగ్ ను షేర్ చేసినప్పుడు మాత్రమే అది మరొకరికి షేర్ అవుతుందని వెల్లడించింది.
ఈ కొత్త ఫీచర్ పాత ఆండ్రాయిడ్ వెర్షన్ ఉన్న ఫోన్లలోనూ, పాత వాట్సాప్ వెర్షన్లలోనూ పని చేసే అవకాశం లేదని వాట్సాప్ తెలిపింది. అంతేకాదు, ఎక్కువ సంఖ్యలో గ్రూప్ వీడియో కాలింగ్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఫీచర్ పనిచేయకపోవచ్చని సమాచారం. యూజర్లు ఇకపై తమ ఖాతాలకు యూజర్ నేమ్‌లు పెట్టుకునే సదుపాయాన్నీ వాట్సాప్ తీసుకురానుంది. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ దశలో ఉంది.
వాట్సాప్ ఇటీవలే ఎడిట్ మెసేజ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతరులకు సెండ్ చేసిన మెసేజ్ ను 15 నిమిషాల లోపు ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. మెసేజ్ లో ఏవైనా పొరపాట్లు దొర్లితే, డిలీట్ చేసి మళ్లీ పంపాల్సిన అవసరం లేకుండా పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసి పంపితే సరిపోతుంది. రీసెంట్ గా చాట్ లాక్ ఫీచర్ ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఎవరూ చూడకూడదు అనుకున్న చాట్ కు లాక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
Read Also: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!