World Test Championship:


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్‌, ఆస్ట్రేలియా ప్రిపరేషన్స్‌ మొదలు పెట్టాయి. ఆదివారం రెండు బోర్డులు ఐసీసీకి తుది ఆటగాళ్ల జాబితాలను సమర్పించాయి. క్రికెట్‌ ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టులో మార్పులు చేయగా బీసీసీఐ అలాగే ఉంచింది.


టీమ్‌ఇండియా జూన్‌ 7 నుంచి 11 వరకు ఓవల్‌ మైదానంలో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఐపీఎల్‌ వల్ల బీసీసీఐ ఆటగాళ్లను బ్యాచులు బ్యాచులుగా లండన్‌కు పంపిస్తోంది. భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడటం ఇది రెండోసారి. అరంగేట్రం ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది.


ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా మొదట 17 మందిని ఎంపిక చేసింది. మళ్లీ మార్పులు చేసి ఇద్దరిని తగ్గించింది. అనుభవజ్ఞుడైన పేసర్‌ జోష్ హేజిల్‌వుడ్‌ను తీసుకుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో గాయపడటంతో అతడి స్థానంలో మైకేల్‌ నెసర్‌ను తీసుకుంటారని చాలామంది అంచనా వేశారు. అయితే జూన్‌ 7 లోపు అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని నమ్మకం ఉంచింది. ఇకపై గాయాలు, ఇబ్బందులతో 15 మందితో కూడిన జట్టులో ఆసీస్‌ మార్పులు చేయాలంటే ఐసీసీ టెక్నికల్‌ కమిటీని సంప్రదించాలి.


ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌, మ్యాట్‌ రెన్షాను ఆస్ట్రేలియా స్టాండ్‌బై ప్లేయర్లుగా ప్రకటించింది. లండన్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ ప్రిపరేషన్‌కు నెసర్‌, సేన్‌ అబాట్‌ సేవలను కంగారూలు ఉపయోగించుకుంటారు. బ్యాకప్‌ కీపర్‌ జోష్‌ ఇంగ్లిస్‌, నేథన్‌ లైయన్‌ వారసుడిగా భావిస్తున్న టాడ్‌ మర్ఫీకి తుది జట్టులో చోటు దక్కింది.


టీమ్‌ఇండియా ఇప్పటికే 15 మందితో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది. స్టాండ్‌ బై ఆటగాళ్లను మార్చింది. పెళ్లి పనుల వల్ల రుతురాజ్ గైక్వాడ్‌ అందుబాటులో ఉండటం లేదు. అతడి ప్లేస్‌లో యశస్వీ జైశ్వాల్‌ను తీసుకొంది. సూర్యకుమార్‌ యాదవ్‌, ముకేశ్ కుమార్‌తో కలిసి అతడు లండన్‌కు వెళ్తాడు.


ఐపీఎల్‌ 2023లో యశస్వీ జైశ్వాల్‌ అదరగొట్టాడు. వీరోచిత ఫామ్‌ కనబరిచాడు. 14 మ్యాచుల్లో 625 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలు బాదేశాడు. పవర్‌ ప్లే అంటే తన పేరే గుర్తొచ్చేలా ఆడాడు. తొలి ఆరు ఓవర్లలో బ్లాస్టింగ్‌ ఓపెనింగ్‌ పాట్నర్‌షిప్స్‌ నెలకొల్పాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. 15 మ్యాచుల్లో 80.21 సగటుతో 9 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీలు బాదాడు. 1845 పరుగులు సాధించాడు.


ఇక 2022-23 రంజీ ట్రోఫీలో యశస్వీ 5 మ్యాచుల్లో 315 పరుగులు చేశాడు. 45 సగటు సాధించాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ అతడి ఖాతాలో ఉన్నాయి. ఆ తర్వాత ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియాకు ఆడాడు. మధ్యప్రదేశ్‌పై 213, 144 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు జరిగిన ఇరానీ ట్రోఫీ మ్యాచులో అతడు చేసి 357 పరుగులే అత్యుత్తమ గణాంకాలు.


ఆస్ట్రేలియా: ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్, నేథన్‌ లైయన్‌, టాడ్‌ మర్ఫీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్‌ వార్నర్‌


స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్‌ మార్ష్‌, మాథ్యూ రెన్షా


భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేశ్ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌


స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌