IND vs AUS, WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై ఆస్ట్రేలియా పట్టుబిగించింది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌట్ చేసి 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. మార్నస్ లబూషేన్ (118 బంతుల్లో 41 బ్యాటింగ్, 4 ఫోర్లు), కామెరూన్ గ్రీన్ (27 బంతుల్లో 7 నాటౌట్, 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 296 పరుగులకే ఆలౌట్ చేయడంతో దక్కిన ఆధిక్యంతో పాటు మూడో రోజు ఆటముగిసే సమయానికి చేసిన పరుగులతో ఆసీస్ ఆధిక్యం సుమారు 300 (296 పరుగులు) కు చేరింది.
ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండటంతో ఈ టెస్టులో ఫలితం తేలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అది టీమిండియాకు అనుకూలంగా రానుందా..? ఆసీస్‌కా అన్నది మాత్రం రేపు తేలనుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మొగ్గు ఆసీస్ వైపునకే ఉంది.
ఆదుకున్న రహానె- శార్దూల్..
ఓవర్ నైట్ స్కోరు 151 - 5 వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన భారత జట్టు ఒక్క పరుగు తీసి వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (5) వికెట్ల కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్ ఠాకూర్ (109 బంతుల్లో 51, 6 ఫోర్లు) తో కలిసి రహానె (129 బంతుల్లో 89, 11 ఫోర్లు, 1 సిక్స్) టీమిండియాను ఆదుకున్నాడు. ఇద్దరూ కలిసి ఏడో వికెట్ కు 109 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశారు.
సాఫీగా సాగుతున్న ఈ ఇన్నింగ్స్ లంచ్ తర్వాత కుదుపునకు లోనైంది. లంచ్ తర్వాతి ఓవర్ వేసిన కమిన్స్ బౌలింగ్ లో గ్రీన్ సూపర్ క్యాచ్‌తో రహానె నిష్క్రమించాడు. ఉమేశ్ యాదవ్ (5) కూడా అలా వచ్చి ఇలా వెళ్లాడు. రహానె ఔట్ అయ్యాక శార్దూల్ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకుని గ్రీన్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చాడు. షమీ (13) కూడా త్వరగానే నిష్క్రమించాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్.. 296 పరుగుల వద్ద ముగిసింది.
ఆసీస్ ఓపెనర్లను కోల్పోయినా..
173 పరుగుల తొలి ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోనే సిరాజ్, ఉమేశ్ లు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు. డేవిడ్ వార్నర్ (1) ను సిరాజ్ ఔట్ చేయగా ఉస్మాన్ ఖవాజా (13) ను ఉమేశ్ పెవిలియన్ పంపాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ భరత్‌కే క్యాచ్ లు ఇచ్చారు.
24 పరుగులకే ఓపెనర్లను కోల్పోయినా టీమిండియా మళ్లీ పట్టు విడిచింది. స్టీవ్ స్మిత్ (47 బంతుల్లో 34, 3 ఫోర్లు) తో కలిసి మార్నస్ లబూషేన్ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. అయితే స్మిత్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. జడ్డూ వేసిన 30.1 వ ఓవర్లో స్మిత్ భారీ షాట్ ఆడబోయి శార్దూల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ (18) కూడా ఎక్కువసేపు నిలువలేదు. హెడ్ వికెట్ కూడా జడ్డూకే దక్కింది.