Shardul Thakur Record: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన పేరిట మరో ఘనతను సొంతం చేసుకున్నాడు.  పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పెద్దగా ప్రభావం చూపని ఈ ముంబై ఆటగాడు టెస్టులలో మాత్రం భారత్‌కు ఆపద్బాంధవుడిగా మారాడు. విదేశీ పిచ్‌లపై బంతితోనే గాక బ్యాట్‌తో కూడా అదరగొట్టే శార్దూల్.. తాజాగా  కెన్నింగ్టన్ ఓవల్ లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తుది పోరులో అజింక్యా రహానే‌తో కలిసి భారత్‌కు ఫాలో ఆన్ తప్పించాడు. 


ఈ క్రమంలో శార్దూల్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్ వంటి దిగ్గజాలకు మాత్రమే సొంతమైన రికార్డును సమం చేసి వారి సరసన నిలిచాడు.  శార్దూల్.. ఓవల్‌లో బ్రాడ్‌మన్, బోర్డర్ తర్వాత వరుసగా మూడు ఇన్నింగ్స్ (టెస్టు)లలో అర్థ సెంచరీలు సాధించాడు. 


 






తాజాగా జరుగుతున్న ఫైనల్‌లో  శార్దూల్.. పాట్ కమిన్స్ వేసిన  68వ ఓవర్‌లో ఆరో బంతికి  బౌండరీ సాధించి అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.  ఓవల్‌లో శార్దూల్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. భారత జట్టు  2021 ‌లో  ఇంగ్లాండ్ పర్యటనలో  ఓవల్‌లో నాలుగో టెస్టు ఆడింది.   ఈ మ్యాచ్‌లో శార్దూల్ భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 36 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో.. 72 బంతుల్లో  60 పరుగులు చేశాడు.   తాజాగా  కూడా శార్దూల్ 109 బంతుల్లో 51 పరుగులు సాధించాడు.   


ఓవల్‌లో విజిటింగ్  బ్యాటర్లు మూడు ఇన్నింగ్స్‌లలో అర్థ సెంచరీలు చేసిన బ్యాటర్లలో గతంలో   బ్రాడ్‌మన్ (1930 - 1934), అలెన్ బోర్డర్ (1985-89) లలో మూడు అర్థ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత ఘనత శార్దూల్‌కే దక్కింది.  


 






2018లో కెరీర్ ఆరంభించిన  శార్దూల్.. ఓవల్ తో కలిపి ఇప్పటివరకు 9 టెస్టులు ఆడాడు.  ఓవల్ టెస్టులో రహానేతో కలిసి   ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించిన శార్దూల్.. భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. కానీ లంచ్  తర్వాత రహానే నిష్క్రమణతో భారత్  బ్యాటింగ్ లైనప్  కుదేలైంది.  టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పుజారా, శుభ్‌మన్ గిల్  లు విఫలమైన చోట  రహానే‌తో కలిసి శార్దూల్ అద్భుతంగా  ఆడాడు. 


ఇక  మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా   121.3 ఓవర్లలో 469 పరుగులు చేశాడు.  ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121)  రాణించారు.  అనంతరం భారత్..  తొలి ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అయింది.  రహానే (89), శార్దూల్ (51), జడేజా (48) లు భారత్‌ను ఆదుకున్నారు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. 18 ఓవర్లు ముగిసేసరికి  2 వికెట్ల నష్టానికి  46 పరుగులు చేసింది.  ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా  (13), డేవిడ్ వార్నర్ (1) లు పెవిలియన్ చేరగా లబూషేన్ (16 నాటౌట్), స్టీవ్ స్మిత్ (13 నాటౌట్)  లు క్రీజులో ఉన్నారు.