WTC Final 2023: 


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా గట్టి పోటీనిస్తోంది! ఆస్ట్రేలియా బౌలర్లను ఇబ్బంది పెడుతోంది. మూడో రోజు, శుక్రవారం భోజన విరామానికి 60 ఓవర్లకు, 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. 15 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన అజింక్య రహానె (89 బ్యాటింగ్‌; 122 బంతుల్లో 11x4, 1x6) సెంచరీకి చేరువయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో హాఫ్‌ సెంచరీ అందుకొన్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. శార్దూల్‌ ఠాకూర్‌ (36 బ్యాటింగ్‌; 83 బంతుల్లో 4x4) అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 133 బంతుల్లో 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. హిట్‌మ్యాన్‌ సేన ఇంకా 209 పరుగుల లోటుతో ఉంది.




ఒక పరుగుకే శ్రీకర్‌ ఔట్‌


మూడో రోజు, శుక్రవారం 151/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో టీమ్‌ఇండియా ఆట ఆరంభించింది. ఒక పరుగు వచ్చిందో లేదో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ కేఎస్ భరత్‌ (5) ఔటయ్యాడు. స్కాట్‌ బొలాండ్‌ వేసిన 38.2వ బంతికి ఔటయ్యాడు. ఆరో స్టంప్‌లైన్‌లో వచ్చిన బంతి అతడి బ్యాటు లోపలి అంచుకు తగిలి వికెట్లను ఎగరగొట్టింది. ఇలాంటి డిఫికల్ట్‌ సిచ్యువేషన్లో క్రీజులో నిలిచిన  అజింక్య రహానె (29) అదరగొట్టాడు. ప్రపంచంలోని గొప్ప బ్యాటర్లలో తానొకడిని అని చాటుకున్నాడు. చక్కని స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లను అటాక్‌ చేశాడు. నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 92 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకొన్నాడు. చివరి డబ్ల్యూటీసీ ఫైనల్లోని తన స్కోరు (49)ని దాటేశాడు.




సాహో.. అజింక్య!


అజింక్య రహానెకు తోడుగా శార్దూల్‌ ఠాకూర్ నిలబడ్డాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో అతడి చేతికి వరుసగా రెండుసార్లు బంతి తగిలింది. నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియోల సాయం తీసుకొని మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అప్పట్నుంచి వేగంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మరోవైపు రహానె టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొత్తంగా శుక్రవారం తొలి సెషన్లో టీమ్‌ఇండియా 22 ఓవర్లు ఆడి ఒక వికెట్‌ నష్టపోయి 109 పరుగులు సాధించింది. ఈ జోడీ ఇలాగే నిలబడితే ఆసీస్‌ స్కోరును సునాయాసంగా సమం చేయగలదు! స్కాట్‌ బొలాండ్‌ 2 వికెట్లు తీశాడు. స్టార్క్‌, కమిన్స్‌, గ్రీన్‌, లైయన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.