WTC Final 2023, Ajinkya Rahane: 


సీనియర్‌ క్రికెటర్‌ అజింక్య రహానె అరుదైన రికార్డు సృష్టించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో హాఫ్ సెంచరీ కొట్టిన తొలి భారతీయుడిగా అవతరించాడు. కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియాను ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. మూడో రోజు ఆట ఆరంభించినప్పటి నుంచి మంచి ఇంటెంట్‌ చూపిస్తున్నాడు. సిక్సర్‌తో అతడీ ఘనత అందుకోవడం ప్రత్యేకం. దాదాపుగా 18 నెలల తర్వాత అతడు టెస్టు క్రికెట్‌ ఆడుతుండటం గమనార్హం. అతడికి శార్దూల్‌ ఠాకూర్‌ అండగా నిలిచాడు.




వెంటనే వికెట్‌


మూడో రోజు, శుక్రవారం 151/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో టీమ్‌ఇండియా ఆట ఆరంభించింది. ఒక పరుగు వచ్చిందో లేదో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ కేఎస్ భరత్‌ (5) ఔటయ్యాడు. స్కాట్‌ బొలాండ్‌ వేసిన 38.2వ బంతికి ఔటయ్యాడు. ఆరో స్టంప్‌లైన్‌లో వచ్చిన బంతి అతడి బ్యాటు లోపలి అంచుకు తగిలి వికెట్లను ఎగరగొట్టింది. ఇలాంటి డిఫికల్ట్‌ సిచ్యువేషన్లో క్రీజులో నిలిచిన  అజింక్య రహానె (29) అదరగొట్టాడు. ప్రపంచంలోని గొప్ప బ్యాటర్లలో తానొకడిని అని చాటుకున్నాడు. చక్కని స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లను అటాక్‌ చేశాడు. నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 92 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకొన్నాడు. చివరి డబ్ల్యూటీసీ ఫైనల్లోని తన స్కోరు (49)ని దాటేశాడు.




పట్టుదలగా జింక్స్‌


అజింక్య రహానెకు తోడుగా శార్దూల్‌ ఠాకూర్ నిలబడ్డాడు. కమిన్స్‌ బౌలింగ్‌లో అతడి చేతికి వరుసగా రెండుసార్లు బంతి తగిలింది. నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియోల సాయం తీసుకొని మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అప్పట్నుంచి వేగంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఏడో వికెట్‌కు 101 బంతుల్లో 81 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. మరో వైపు వికెట్‌ కూడా బ్యాటర్లకు అనుకూలంగా మారింది. ఇదే మంచి తరుణం అనుకొంటూ రహానె టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 55 ఓవర్లు ముగిసే సరికి టీమ్‌ఇండియా 234/6లో నిలిచింది. 235 పరుగులు వెనకబడి ఉంది.


స్కోరు వివరాలు


55 ఓవర్లకు టీమ్‌ఇండియా 234/6
అజింక్య రహానె (71; 110 బంతుల్లో 8x4, 1x6)
శార్దూల్‌ ఠాకూర్ (30; 64 బంతుల్లో 3x4)