IND vs AUS, WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా  ఆధిక్యం పెరుగుతోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా..  తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి   నాలుగో ఓవర్లోనే వికెట్ కోల్పోయినా  తర్వాత   నిలకడగా ఆడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడిన  డేవిడ్ వార్నర్ (8 బంతుల్లో 1) విఫలమయ్యాడు.  తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే  రెండో ఇన్నింగ్స్‌లో కూడా  సిరాజ్.. భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. 


టీ విరామ సయమానికి  ఆస్ట్రేలియా 11 ఓవర్లలో  ఒక వికెట్ నష్టానికి  23 పరుగులు చేసింది.   ఉస్మాన్ ఖవాజా (32 బంతుల్లో 13 నాటౌట్, 2 ఫోర్లు), మార్నస్ లబూషేన్ (25 బంతుల్లో 8 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం ఆసీసీ ఆధిక్యం తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకుని  196 పరుగులకు చేరింది.  


ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకూ వేసింది 11 ఓవర్లే అయినా భారత పేసర్లు   మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు.  షమీ.. 4 ఓవర్లు వేసి  ఐదు పరుగులే ఇవ్వగా శార్దూల్ కూడా  2 ఓవర్లలో నాలుగు పరుగులే ఇచ్చాడు.  మహ్మద్ సిరాజ్ ఐదు ఓవర్లు వేసి రెండు మెయిడిన్లు చేసి  14 పరుగులే ఇచ్చి వార్నర్ వికెట్ పడగొట్టాడు.  మరి టీ తర్వాత భారత బౌలర్లు  ఆసీస్ బ్యాటర్లను ఏ మేరకు నిలువరించగలుగుతారనేది ఇప్పుడు ఆసక్తికరం. 


 






ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ విషయానికొస్తే.. మూడో రోజు 151/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో టీమిండియా ఆట ఆరంభించింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ కేఎస్ భరత్‌ (5) ఔటయ్యాడు. స్కాట్‌ బొలాండ్‌ వేసిన 38.2వ బంతికి ఔటయ్యాడు. ఆరో స్టంప్‌లైన్‌లో వచ్చిన బంతి అతడి బ్యాటు లోపలి అంచుకు తగిలి వికెట్లను ఎగరగొట్టింది. ఇలాంటి డిఫికల్ట్‌ సిచ్యువేషన్లో క్రీజులో నిలిచిన  అజింక్య రహానె  అదరగొట్టాడు. చక్కని స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లను అటాక్‌ చేశాడు. నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 92 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకొన్నాడు. ఈ క్రమంలో  అతడు  చివరి డబ్ల్యూటీసీ ఫైనల్లోని తన స్కోరు (49)ని దాటేశాడు.


రహానెకు తోడుగా శార్దూల్‌ ఠాకూర్ కూడా నిలబడ్డాడు. మరోవైపు రహానె టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. దాంతో 60 ఓవర్లకు 260/6తో టీమ్‌ఇండియా లంచ్‌కు వెళ్లింది. ఈ ఇద్దరూ కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 


భోజన విరామం నుంచి రాగానే టీమిండియాకు వరుస షాకులు తగిలాయి. పరుగులేమీ జత చేయకుండానే అజింక్య రహానె ఔటయ్యాడు. కమిన్స్‌ వేసిన 61.6వ బంతికి అతడు పెవిలియన్‌ చేరాడు. అప్పటి వరకు ఈజీ క్యాచులు వదిలేసిన ఆసీస్‌.. ఈ క్యాచ్‌ను మాత్రం వదల్లేదు. గల్లీలో కామెరాన్‌ గ్రీన్ అమేజింగ్‌గా అందుకున్నాడు. అప్పటికి స్కోరు 261. దాంతో వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. మరో 10 పరుగులకే ఉమేశ్ యాద్‌ (5)ను కమిన్సే పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన శార్దూల్‌ 108 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే జట్టు స్కోరు 294 వద్ద గ్రీన్‌ బౌలింగ్‌లో కేరీకి క్యాచ్‌ ఇచ్చాడు. మహ్మద్‌ షమి (13) ఎక్కువ సేపు నిలవలేదు.