Pros and Cons of Sleeping with a Pillow : మెరుగైన నిద్రలో తలగడ కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. లేదంటే నిద్ర రావడం అటుంచి.. ఇతర శారీరక సమస్యలు వస్తాయి అంటున్నారు. దిండు వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ తలగడతో పడుకుంటే మంచిదా? దిండు లేకుండా పడుకుంటే మంచిదా? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి? అసలు పిల్లో లేకుండా పడుకోవచ్చా? ఎలాంటి దిండు ఎంచుకుంటే మంచిది?
దిండుతో కలిగే లాభాలు
- మెడ, వెన్నెముకకు.. దిండుతో నిద్రపోవడం వల్ల మెడ, వెన్నుముక అమరికకు సపోర్ట్ దొరుకుతుంది. దీనివల్ల నడుము నొప్పి, మెడనొప్పి వంటి తగ్గుతాయి. అలాగే ఒత్తిడి, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ మెడభాగంలో ఉంటుంది. అది దిండుపై రిలాక్స్ అయినప్పుడు ఒత్తిడినుంచి ఉపశమనం లభిస్తుంది.
- కంఫర్ట్.. తలగడ అనేది మీ తల, మెడకు సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే మీరు విశ్రాంతి తీసుకోవడంలో, వేగంగా నిద్రపోవడంలో హెల్ప్ చేస్తుంది. కంఫర్ట్‌గా ఉండి.. మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.
- గురక తగ్గుతుందట.. గురక, స్లీప్ ఆప్నియా వంటి సమస్యలున్నవారు దిండు ఉపయోగిస్తే మంచిదట. ఎందుకంటే.. తలను ఓ దిండుతో పైకి లేపడం వల్ల మీ శ్వాసనాళాలు తెరుచుకుంటాయి. దీనివల్ల గురక, స్లీప్ ఆప్నియా తగ్గుతుంది.
దిండుతో కలిగే నష్టాలివే..
- అలెర్జీ.. దిండును శుభ్రంగా ఉంచకపోయినా.. పిల్లో కవర్స్ రెగ్యులర్‌గా మార్చకపోయినా దానిలో దుమ్ము పురుగులు ఉంటాయి. బూజు వంటి అలెర్జీ కారకాలు పెరుగుతాయి. ఇవి ఆస్తమా వంటి శ్వాస సమస్యలను పెంచుతాయి.
- మెడ నొప్పి.. దిండు మెడనొప్పిని తగ్గిస్తుంది. కానీ బాగా మందంగా ఉండే లేదా బాగా సన్నగా ఉండే తలగడను ఉపయోగించడం ద్వారా మెడనొప్పితోపాటు వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఇది వెన్నెముక అమరికకు అంతరాయం కలిగిస్తుంది. కాబట్టి సరైన దిండును ఎంచుకోవాలి.
- నిద్ర సమస్యలు.. చాలామంది బాగా మృదువైన లేదా దృఢమైన దిండును ఉపయోగిస్తారు. ఈ రెండు నిద్ర నాణ్యతకు భంగం కలిగిస్తాయి. నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం దీనిలో భాగమవుతాయి. దీనివల్ల మీరు పగలు ఏపని చేయలేరు. అలసిపోతారు.
సరైన దిండు ఎలా ఎంచుకోవాలంటే..
దిండు కొనుక్కునేప్పుడు కచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. మీ మెడకు సపోర్ట్ చేసే, వెన్నెముకకు ఇబ్బంది కలిగించని దిండును ఎంచుకోవాలి. మీరు పడుకునే పొజిషన్ బట్టి కూడా పిల్లోని ఎంచుకోవాలి. సైడ్ స్లీపర్స్ సాఫ్ట్‌గా ఉండే దిండు ఎంచుకోవాలి. బ్యాక్ స్లీపర్స్ ఫిర్మర్ పిల్లో వాడితే మంచిది. మెమరీ ఫోమ్ లేదా రబ్బరు పాలతో చేసే హైపోఅలెర్జెనిక్ పిల్లోలు కూడా మంచి ఆప్షన్. మీ దిండును క్రమం తప్పకుండా మార్చాలి. కనీసం 1 లేదా రెండు సంవత్సరాలకు ఓసారి దిండును మార్చితే అలెర్జీలు రాకుండా ఉంటాయి.
దిండు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర మెరుగవడంతో పాటు.. మెడనొప్పి, వెన్ను నొప్పి కూడా దూరమవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీ దిండు పరిస్థితి ఏంటో.. ఎలాంటి దిండు మీకు సెట్ అవుతుందో చూసి మార్చేయండి.
Also Read : పిల్లలతో తల్లిదండ్రులు ఈ విషయాలు కచ్చితంగా మాట్లాడాలి.. టీనేజర్స్‌కు ఇవ్వాల్సిన రిలేషన్షిప్ సూచనలివే