ఒకరోజు తినే భోజనంలో ఉదయం తినే అల్పాహారమే చాలా ముఖ్యం. కానీ చాలా మంది దాన్నే స్కిప్ చేస్తారు. అలా స్కిప్ చేయడం వల్ల పెద్దలకు, పిల్లలకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిల్లలకు అల్పాహారం దాటవేయకూడదు. ఇది వారిలో త్వరగా  మానసిక సమస్యలు వచ్చేలా చేస్తుంది. ఇంట్లో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తినే పిల్లల్లో మానసిక ఆరోగ్యం బావున్నట్టు అధ్యయనాలు కనుగొన్నాయి. ఏ పిల్లలైతే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారో వారిలో మాత్రం మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. చదువులో కూడా ముందు స్థానంలో నిలవలేరు. 


స్పెయిన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో అల్పాహారం తినకుండా దాటవేయడం, అలాగే ఇంటి ఆహారం కాకుండా బయట అల్పాహారం తినడం... ఈ రెండూ వారి మానసిక ఆరోగ్యం చాలా ప్రభావం చూపిస్తున్నట్టు తేలింది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు అధికంగా తినేవారిలో కూడా పెద్దయ్యాక త్వరగా మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ అధ్యయనంలో 2017 నుంచి స్పానిష్ జాతీయ సర్వే నుంచి డేటాను విశ్లేషించారు. ఈ సర్వేలో అల్పాహారం అలవాట్లు పిల్లల మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉన్నట్టు తేలింది. కొన్ని రకాల ప్రశ్నాపత్రాలను పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చిన అందులో వారి పిల్లల ఆహారపు అలవాట్లను రాయమన్నారు. నాలుగు నుంచి పద్నాలుగేళ్ల వయసు లోపల ఉన్న పిల్లలను ఇందుకు ఎంచుకున్నారు. మొత్తం 3,772 మందిపై ఈ సర్వే సాగింది. 


ఇంటి ఆహారమే బెటర్
అల్పాహారంగా ఇంటి ఆహారమే తినడం ఉత్తమమని బయట కొన్న ఆహారం తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, అది మరింత హానికరమని కూడా చెప్పారు అధ్యయనకర్తలు. ఉదయం పిల్లలు ఇంట్లో పెరుగు, బ్రెడ్, టోస్ట్, తృణధాన్యాలు వంటి వాటితో చేసినవి తినడం వల్ల వారిలో ప్రవర్తనా పరమైన సమస్యలు వచ్చే అవకాశం తక్కువని అధ్యయన ఫలితాలు చెప్పాయి. ఈ అధ్యయనం కేవలం స్పెయిన్ కి పరిమితం అనుకోకూడదు. పిల్లల విషయంలో ప్రపంచదేశాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి అల్పాహారాన్ని పిల్లలకు ఇంటి దగ్గరే తినిపించి పంపడమో లేక, ఇంటి దగ్గర వండిన వాటిని బాక్సుల్లో పెట్టి పంపించడమో చేయాలి. తల్లిదండ్రులుగా వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే. 


Also read: అద్భుతగుణాలున్న ఈ పుట్టగొడుగులు మద్యం అలవాటును మానిపించేస్తాయి, పరిశోధనలు సక్సెస్


Also read: ఓటీటీలో సినిమాలు చూస్తూ తినేందుకు ఈ స్నాక్స్ ఆరోగ్యకరం























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.