Telangana Constable Exam: తెలంగాణలో కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష మొదలైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. గంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని ముందే అధికారులు నిర్దేశించిన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా 1,601 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మరో 35 పట్టణాలు, నగరాల్లో పరీక్ష కేంద్రాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న మొత్తం 15,644 పోస్టులకు 9.54 లక్షల మంది దరఖాస్తులు చేశారు.


గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోగా, పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. చేతులకు మెహిందీ, టాటూలు ఉండకూడదని నిబంధన విధించారు. మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదన్న నిబంధన కూడా ఉంది. ఆ నిబంధనల మేరకు పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి అభ్యర్థులను లోపలికి పంపించారు. ఈ సారి 16,321 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఏకంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీఎత్తున కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరీక్ష జరుగుతోంది.


అభ్యర్థి పరీక్ష రాసే గదిలోకి తన వెంట హాల్‌ టికెట్‌తో పాటు బ్లూ లేదా బ్లాక్‌ బాల్ పాయింట్‌ పెన్‌ను మాత్రమే తీసుకెళ్లాలి. సెల్‌ఫోన్‌, టాబ్లెట్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ డివైజ్‌, చేతి గడియారం, కాలిక్యులేటర్‌, లాగ్‌ టేబుల్‌, వాలెట్‌, పర్స్‌, నోట్స్‌, చార్ట్‌, రికార్డింగ్‌ పరికరాలు, ఖాళీ పేపర్లను వెంట తీసుకెళ్లకూడదు. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్‌ను ఏ - 4 సైజ్‌ పేపర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం నిర్దేశిత స్థలంలో తప్పనిసరిగా అభ్యర్థి ఫొటోను గమ్‌తో అతికించుకోవాలి. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్‌ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వాడాలి.


ఈసారి మార్కుల కుదింపు


కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కుల్ని ఈసారి కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం, బీసీలు 35 శాతం, ఇతరులు 40 శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా గుర్తించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30 శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ టైప్‌లో 200 ప్రశ్నలు ఉండనున్నాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. 


నెగటివ్ మార్కులు కూడా
నెగెటివ్‌ మార్కులు కూడా ఉంటాయి. అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గిస్తారు. అంటే తప్పుడు సమాధానానికి 0.2 నెగెటివ్‌ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత పొందితే తర్వాత ఫిజికల్ బాడీ టెస్టు ఉండనుంది. ఇదీ గట్టెక్కితే తుది రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో నెగెటివ్‌ మార్కులు ఉండవు.


కొన్ని చోట్ల అనుమతించని సిబ్బంది


కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థుల విషయంలో నిమిషం నిబంధనను అధికారులు కచ్చితంగా పాటించారు. ఆలస్యమైన అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. దీంతో కొన్ని చోట్ల యువతీ యువకులు కన్నీటి పర్యంతం అయ్యారు. తాము ఈ పరీక్ష కోసం ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అయ్యామని, ఆ కష్టం అంతా వృథా అయ్యిందని ఆవేదన చెందారు.