YV Subbareddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తోడల్లుడిని అయినందుకే తనను కేసులో ఇరికించారంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇందూ-హౌసింగ్ బోర్డు ఒప్పందాలకు సంబంధించిన అవకతలవకలపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని ధర్మాసనానికి నివేదించారు. కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడిని అయినందుకే ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చారని.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో వివరించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... పిటిషర్ పై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైందని అయితే ఈ చట్టం కింద మరే అధికారి నిందితుడిగా లేరని అన్నారు. 


ఏ సంబంధమూ లేదు.. 
హైకోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా తన పేరు లేదని వై.వి. సుబ్బా రెడ్డి వివరించారు. గచ్చిబౌలి ప్రాజెక్టులో ఇందూ ప్రాజెక్టుకు ఉన్న 50 శాతం వాటా ఇందూ-హౌసింగ్ బోర్డుకు బదిలీ అయిందని ప్రధాన ఆరోపణ అని ఆయన తెలిపారు. 4.23 ఎకరాల గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టును వసంత ప్రాజెక్టు అప్పట్లో దక్కించుకుందని సుబ్బా రెడ్డి వివరించారు. అయితే ఆ తర్వాత పురపాలక నిబంధనలు మారాయని, ఆక్రమణలు పెరిగిపోయాయని, సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గచ్చిబౌలి హౌజింగ్ ప్రాజెక్టు ముందుకు సాగలేదని టీటీడీ ఛైర్మన్ సుబ్బా రెడ్డి వెల్లడించారు. గడువు దగ్గర పడుతున్న సమయంలో ఇందూ కంపెనీ గచ్చిబౌలి హౌసింగ్ ప్రాజెక్టు నుండి బయటకు రావాలని నిర్ణయించుకుందని వివరించారు. 


ఆ వాదనల్లో వాస్తవం లేదు 
ఇందులో భాగంగా వసంత ప్రాజెక్ట్స్ లోని 50 శాతం వాటాలను సుబ్బా రెడ్డికి విక్రయించిందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిఫలంగానే ఇందూ కంపెనీకి కూకట్ పల్లిలో అదనంగా 15 ఎకరాలు కేటాయించడానికి పిటిషనర్ ఒత్తిడి తెచ్చారన్న వాదనలో వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డికి హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో 70 ఎకరాల భూమిని ఏపీహెచ్ బీ ఇచ్చిందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. విల్లాలు, ఎంఐజీ, ఎల్ఐజీ రేంజ్ హౌస్ లతో సహా అనేక రకాల గృహాలను నిర్మించడానికి ఈ భూములకు అప్పట్లో అనుమతి ఇచ్చారు. ఇందూ ప్రాజెక్ట్స్ ప్రమోటర్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఇందూ ప్రాజెక్టులకు అర్హతలు లేకపోయినా.. హౌసింగ్ ప్రాజెక్టులను పొందేందుకు కృష్ణ ప్రసాద్ వసంత ప్రాజెక్టులను స్పెషల్ పర్పస్ వెహికల్ గా ఉపయోగించారు. 


సెప్టెంబరు 8కి వాయిదా 
గచ్చిబౌలిలో నిర్మించిన విల్లాలపై కృష్ణ ప్రసాద్, సుబ్బా రెడ్డి తమ కుటుంబాలకు తక్కువ ధరకే ఇచ్చారని సీబీఐ న్యాయవాది కోర్టు ముందు వాదించారు. సీబీఐ ప్రకారం, ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని స్వీకరించడానికి బదులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాపారానికి శ్యామ్ ప్రసాద్ 70 కోట్ల రూపాయలను అందించారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను సెప్టెంబరు 8కి వాయిదా వేసింది. తదుపరి వాదనలు అప్పుడు జరుగుతాయని వెల్లడించింది.