Vengal Rao Comments: న్యాయస్థానాలు దేవస్థానాలుగా, జడ్జీలు దేవుళ్లుగా బాధితుల పక్షాన ఉన్నారు కనుక రాష్ట్రంలో ఈ మాత్రం ప్రజాస్వామ్యం ఉందని యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు వెంగళరావు అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు బనాయించి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండున్నర సంనత్సరాల నుంచి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను బాధ్యత గల జర్నలిస్టులా ప్రశ్నించానని తెలిపారు. గతంలోనే తనపై పలు కేసులు నమోదయ్యాయని ఆ కేసులపై అరెస్టు చేయడం సాధ్య పడలేదని వివరించారు. అందుకే సంబంధం లేని అక్రమ కేసులో ఇరికించి రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకొని మానసికంగా, శారీరకంగా సీఐడీ పోలీసులు వేదించారన్నారు. టీడీపీ శ్రేణులు అందోళనలకు సిద్దమైతే.. తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులో ప్రవేశ పెట్టారని చెప్పారు. తప్పుడు సెక్షన్‌లతో తనకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని, అయితే న్యాయమూర్తి వాస్తవాలను గ్రహించి దేవుడులా తనకు బైల్ మంజూరు చేశారని అన్నారు.
తనకు బెయిల్ ఇప్పించిన న్యాయవాదికి వెంగళరావు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు కూడా ఒక సారి పునః సమీక్షించుకోవాలని.. తన కుటుంబ సభ్యులు అక్రమ కేసులలో చిక్కుకుంటే ఇదే విధంగా హింసిస్తారా అని ప్రశ్మించారు. తనకు మద్దతు తెలిపిన టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
అధికార పార్టీ వైసీపీపై వ్యతిరేక పోస్టులు పెడుతూ రెచ్చ గొడుతున్నాడన్న అభియోగంపై బొబ్బూరి వెంగళరావును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. "ఘర్షణ" మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న వెంగళరావును సీఐడీ అధికారులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ప్రజల్లో వర్గ వైషమ్యాలను ప్రేరేపిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో ఐపీసీలోని సెక్షన్ 153ఏ, 505(2), 506, 386, 120బీ, ఐటీ చట్టంలోని 67ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గురువారం డీజీపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని విజయవాడ నుంచి బస్సులో వెళ్తున్న సందర్భంలో సీఐడీ పోలీసులు అదుపులో తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్ళారు. అదే రోజు రాత్రి జడ్జీ ఎదుట హాజరుపరచగా వెంగళరావు కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్న డీజీపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని వెళుతున్న సందర్భంలో సీఐడీ పోలీసులు అదుపులో తీసుకొని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకు వెళ్ళారు. నిన్న రాత్రి జడ్జీ ముందు హాజరు పరచగా వెంగళరావు కన్నీటి పర్యంతం అయ్యాడు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించి నానా హింసలు పెట్టారు..!
పోలీసులు బట్టలు విప్పి మరీ తీవ్రంగా హింసించారని తెలిపాడు. కస్టడీలో కొట్టినట్లు చెబితే తన రెండేళ్ల కుమారుడిని చంపేస్తామని హెచ్చరించినట్లు వెల్లడించాడు. అరికాళ్లకు కోటింగ్, థర్డ్ డగ్రీ ప్రయోగించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పాడు. తాము చెప్పినట్లు నడుచుకోకపోతే బెయిల్ కూడా రాదని.. తనపై తన కుటుంబంపై ఇష్టమొచ్చినట్లుగా కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తామని బెదిరించినట్లు వెల్లడించాడు. తన రెండు చేతులు పైకి కట్టేసి.. వాటి మధ్యలో కర్ర పెట్టి అరికాళ్లపై కొట్టారని, బల్లపై పడుకోబెట్టి, తన నడుంపై కూర్చొని కాళ్లు పైకి ఎత్తి కొట్టినట్లు ఏడుస్తూ తెలిపాడు. అలాగే ఒక కర్రతో తన వృషణాల్లో పొడిచే ప్రయత్నం చేసి తనను భయపెట్టారని వివరించాడు.