CPS Protests : సీపీఎస్ పై ఉద్యోగ సంఘాల ఆందోళ‌నపై గంద‌ర‌గోళం నెల‌కొంది. సెప్టెంబ‌ర్ 1న ఆందోళ‌న‌కు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు త‌లో మాట చెబుతున్నాయి. కొన్ని సంఘాలు సీఎం క్యాంప్ కార్యాల‌యం ముట్టడిస్తామంటే, మ‌రికొన్ని ఉద్యోగ సంఘాలు చలో విజ‌య‌వాడ అని, ఇంకొంద‌రు జిల్లా క‌లెక్టరేట్ ల వ‌ద్ద ఆందోళ‌న అని చెబుతున్నారు. అయితే  ఇప్పటికే మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో ఉద్యోగ సంఘాల పలుమార్లు చ‌ర్చలు జ‌రిపారు. సీపీఎస్ పై వెన‌క్కి త‌గ్గేదేలేదంటున్న ప్రభుత్వం, అస‌వ‌రం అయితే మార్పులకు ఓకే చెప్పింది. అయితే ఇందుకు ఉద్యోగ సంఘాలు నో అంటున్నాయి. ప్రభుత్వం త‌మ ఆందోళ‌న‌ను ఎదుర్కొనేందుకు ఉద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో క్యాంప్ కార్యాల‌యం ముట్టడి ఉంటుంద‌న్న సంఘాలు, ముట్టడికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింద‌ని కూడా చెబుతున్నాయి. ఇంత‌కీ వీరి ఆందోళ‌న సెప్టెంబ‌ర్ ఒక‌టిన ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. 


ఇది కూడా వ్యూహ‌మేనా 


సీపీఎస్ ర‌ద్దు, ఉద్యోగుల పంతం అని ఇప్పటికే నినాదాల‌తో హోరెత్తించిన నాయ‌కులు గ‌త ఫిబ్రవ‌రిలో భారీగా ఆందోళ‌న చేపట్టారు. పోలీసుల ఆంక్షల‌ను దాటుకొని ఉద్యోగులంతా చలో బెజ‌వాడ‌కు త‌ర‌లివ‌చ్చారు. దీంతో ప్రభుత్వం కాస్త వెన‌క్కి త‌గ్గి చ‌ర్చలు జ‌ర‌ప‌టంతో పాటు, మంత్రుల‌తో క‌మిటీని ఏర్పాటుచేసింది. మెజార్టీ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించిన‌ప్పటికీ ఉద్యోగులు ప్రధాన డిమాండ్  సీపీఎస్ రద్దుపై మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఇదే ఉద్యోగ సంఘాల్లో చీలిక‌ల‌కు ప్రధాన కార‌ణం అయ్యింది. ఉపాద్యాయ సంఘాలు ఆందోళ‌న కంటిన్యూ చేస్తున్నాయి.  ఇప్పుడు మ‌రోసారి ఉద్యమానికి పిలుపునిచ్చారు.  ఈసారి ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇతర ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న చేస్తున్నాయి.


మంత్రులు ఏమంటున్నారంటే 


ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానంలో మార్పు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రుల కమిటీ తెలిపింది. సీపీఎస్ విధానంలోనూ కొంత మేర తగ్గడానికి ఉద్యోగులు అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హామీలను మేర నెరవేర్చింది. నెరవేర్చని 5  శాతం హామీలల్లో సీపీఎస్ రద్దు అంశం ఒకటి. సీపీఎస్ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతిపాదనల పైనా చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్చలు నిర్వహించ లేదన్నారు. పాత పెన్షన్ విధానం రాష్ట్రాలకు ఆర్థిక భారంగా మారుతుందని కేంద్రం సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలతో పాటు 5 కోట్ల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. గురువులను గౌరవించుకోవడానికే ప్రభుత్వం ఎడ్యు ఫెస్ట్ 2022 నిర్వహిస్తోందన్నారు. ఎడ్యు ఫెస్ట్ నిర్వహణ సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనలను అడ్డుకోడానికి కాదని మంత్రి బొత్స తెలిపారు.  


ఆందోళనలకు నో పర్మిషన్ 


నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని ఉద్యోగుల ఆందోళ‌న‌ను ఉద్దేశించి విజయవాడ పోలీస్ క‌మిష‌న‌ర్ క్రాంతి రాణా టాటా మాట్లాడారు. సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం, ఇతర ఉద్యోగ సంఘాలు వివిధ రకాల నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చాయి. విజయవాడలో నిరసన కార్యక్రమాలకు స్థానిక పోలీస్ అధికారుల నుంచి లేదా ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతులు లేవన్నారు. నగరంలో సెక్షన్ 144 సీఆర్పీసీ, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని చెప్పారు. ఈ నిరసనల కారణంగా  విజయవాడలో శాంతి భధ్రతలకు విఘాతం కలుగుతుందని సమాచారం ఉంద‌న్నారు. ఈ కార్యక్రమాలను అదునుగా చేసుకుని కొంతమంది అసాంఘిక శక్తులు విజయవాడ పరిసర ప్రాంతాలలో రెక్కీ నిర్వహించారన్నారు. శాంతి భధ్రతలకు విఘాతం కల్గించే విధంగా, ప్రభుత్వ , రైల్వే ఆస్తులపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం కూడా ఉంద‌న్నారు. నిబంధనలను అతిక్రమించి ఆందోళనలలో పాల్గొన్నవారిపై చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. 


Also Read : AP BJP : గణేష్ మండపాలకు అనుమతులు తీసుకోవద్దు - ఏపీ బీజేపీ పిలుపు ! ఎందుకంటే ?