Protein Benefits: మన శరీరానికి అన్ని పోషకాలు అందితేనే ఆరోగ్యంగా ఉంటాం. ఫిట్ గా ఉంటాం. రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోగలిగేది కూడా అన్ని పోషకాలు అందినప్పుడే. వాటిల్లో ముఖ్యమైనది ప్రొటీన్. ప్రొటీన్ శరీరానికి చాలా ముఖ్యం. ఒంట్లోని ప్రతి భాగానికి ప్రొటీన్ చాలా అంటే చాలా అవసరం. శరీరంలో ప్రతి కణంలో ఉంటుంది ప్రొటీన్. అందుకే, ఎప్పుడూ ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోమని సూచిస్తుంటారు డాక్టర్లు. మరి ఏ ఫుడ్ తింటే ప్రొటీన్ ఎక్కువగా అందుతుంది, దాని ఆవశ్యకత ఏంటో తెలుసుకుందాం.
శరీరానికి ప్రొటీన్ కచ్చితంగా అవసరం. అందుకే, దాని ప్రాముఖ్యతను, ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రొటీన్ డే కూడా సెలబ్రేట్ చేస్తారు. ఫిబ్రవరి 21న ప్రొటీన్ డే జరుపుకుంటారు. మన డైట్ లో ప్రొటీన్ కి ఎంత అవసరమో తెలియజేసేందుకు ఈ రోజును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు.
అసలు ఎందుకు ఇంత ప్రాధాన్యత?
ప్రొటీన్‌ను బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్ అంటారు. శరీరంలోని ప్రతి సెల్ లో ప్రొటీన్ ఉంటుంది. శరీరంలో జరిగే చాలా ప్రక్రియల్లో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అథ్లెట్లకు, ఫిట్టగా ఉండాలి అనుకునేవాళ్లకి ప్రొటీన్ చాలా అవసరం. మజిల్ స్ట్రెంట్ పెరుగుతుంది. కండరాళ్లు కూడా బలపడతాయి. ఎముకలు బలంగా ఉండాలంటే.. ప్రొటీన్ చాలా అవసరం. ప్రొటీన్ తీసుకుంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావు.
జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడే ఎంజైమ్‌లు, హార్మోన్లను ఉత్పత్తి అయ్యేందుకు ప్రొటీన్ బాగా అవసరం. అలానే ఇమ్యూనిటీ పెరిగేందుకు కూడా ప్రొటీన్ ఉపయోగపడుతుంది. దాంతో రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, రోజుకి ఎంత ప్రొటీన్ తీసుకోవాలి అనేది వయసు, రోజు మనం చేసే యాక్టివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. జిమ్‌కు వెళ్లేవాళ్లు శక్తి రావడం కోసం ప్రొటీన్ ని ఎక్కువగా తీసుకుంటారు. ఇక ఎంత తీసుకోవాలి అనే విషయానికి వస్తే.. వ్యక్తి బరువును బట్టి.. కిలోకి 0.8 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏవి తింటే ప్రొటీన్ అందుతుంది?
పప్పులు, బీన్స్: మొక్క ఆధారిత ధాన్యాలు, పప్పుల్లో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శనగలు, నల్ల మినపప్పు, రాజ్మా లాంటివి శరీరానికి చాలామంచిది. అందుకే సూప్స్, సలాడ్స్ తదితర పదార్థాల్లో వీటిని వేసుకుని తింటే మంచిది.
గ్రీక్ యోగర్ట్ : యోగర్ట్ కంటే గ్రీన్ యోగర్ట్ మంచిదని చెప్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. దీంట్లో ప్రొటీన్ తో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. దీన్ని ప్లెయిన్‌గా లేదా పండ్లలో కలిపి తినొచ్చు.
గుడ్లు: రోజుకో గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే చాలాసార్లు విన్నాం. గుడ్డు ప్రతి ఒక్కరు కొనుక్కోగల ప్రొటీన్ సోర్స్. విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఉడకబెట్టుకుని, బేక్ చేసుకుని రకరకాలుగా దీన్ని తినొచ్చు.
చేప: సాల్మన్, ట్యూనా, సర్డైన్స్ జాతి చేపల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని వారానికి 2 నుంచి 3 సార్లు తీసుకుంటే.. ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అందుతాయి. ఇక గుండె, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
విత్తనాలు, గింజలు : వీటిల్లో ప్రొటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వాటిని డైరెక్ట్ గా తిన్నా, సలాడ్స్ లో లేదా యోగర్ట్ లో కలుపుకుని తిన్నా శరీరానికి మంచిది. ఇక వీటితో స్మూథీస్ కూడా చేసుకుంటారు.
ఇవి గుర్తుంచుకోవాలి..
శరీరానికి ఏదైనా సమపాలల్లో అందిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం అనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రొటీన్ మంచిది అని అదే ఎక్కువగా తీసుకుంటూ మిగతా వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. మిగతా పోషకాలు అందించే పండ్లు, కూరగాయలు, గింజలు లాంటివి తినడం మానేయకూడదు. శరీరానికి కావాల్సిన అమౌనో యాసిడ్స్ అందించే ఫుడ్ ని కూడా కచ్చితంగా తీసుకోవాలి. అందుకే, న్యూట్రిషనిస్ట్ సలహాతో డైట్ పాటించాలి.
అదండీ సంగతి.. శరీరానికి ఏది ఎంత అవసరమో అంత ఇవ్వగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. అందుకే, నేషనల్ ప్రొటీన్ డే ఆవశ్యకతను తెలుసుకుని, ప్రాముఖ్యతను తెలుసుకుని ఆ ఫుడ్ ని మన డైట్ లో పెట్టుకుంటే శరీరం కచ్చితంగా మనకి థ్యాంక్స్ చెప్తుంది.
Also Read: పసిపాపల పాలిట వరం వయాగ్రా - నమ్మశక్యంగా లేదా? ఇది మీరు తెలుసుకోవాల్సిందే!