Halwa Recipe : పెద్దలే కాదు పిల్లలు కూడా బీట్​ రూట్​ను నేరుగా తినేందుకు అంతగా ఇష్టపడరు. అలాగే స్వీట్లు ఎక్కువగా ఇష్టపడతారు. మీరు కూడా అలాంటి వ్యక్తి అయితే మీ హెల్త్​ని కాపాడుకోవడానికి మీరు టేస్టీ హల్వాను రెడీ చేసుకోవచ్చు. రక్తహీనతతో ఇబ్బంది పడేవారు కచ్చితంగా ఈ టేస్టీ ఫుడ్​ని తీసుకోవచ్చు. పిల్లల ఆరోగ్యానికి కూడా ఇది చాలామంచిది. మరి ఈ టేస్టీ, హెల్తీ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


రాగిపిండి - 3 టేబుల్ స్పూన్లు


బీట్ రూట్ - 2


కార్న్ ఫ్లోర్ - అర టేబుల్ స్పూన్


నెయ్యి - 5 టీస్పూన్లు 


జీడిపప్పులు - 10


బెల్లం - 150 గ్రాములు


నీళ్లు - కప్పు


తయారీ విధానం


ముందుగా బీట్​రూట్​ను పీల్ చేసి.. సన్నగా తురుముకోవాలి. బెల్లం కూడా తురిమి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బీట్​రూట్​ తురుమును, రాగిపిండిని మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. దానిలో ముప్పావు కప్పు నీరు వేసి బాగా మిక్సీ చేయాలి. బీట్​ రూట్​ ముక్కలుగా చేసి మిక్సీ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారేమో.. అలా చేస్తే బీట్​రూట్​ పూర్తిగా బ్లెండ్ అవ్వదు. ఇలా తురిమి వేసుకోవడం వల్ల త్వరగా బ్లెండ్ అవ్వడమే కాకుండా.. బీట్​రూట్​ ముక్కలుగా లేకుండా ఉంటుంది. పూర్తిగా బ్లెండ్​ అయ్యాక మిక్సీ ఆపేయండి.


మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో బీట్​రూట్​ మిశ్రమాన్ని వడకట్టండి. బీట్​రూట్ గుజ్జు మిగిలిపోయి.. జ్యూస్ వచ్చేలా పిండేయండి. ఇలా వడకట్టిన దానిలో అరచెంచా కార్న్​ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఉండలు అయిపోయే అవకాశముంది కాబట్టి ఈ పిండిని బాగా మిక్స్​ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి ఓ పాన్ పెట్టి దానిలో చెంచా నెయ్యి వేయండి. దానిలో జీడిప్పపులు వేసి కొంచెం రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి.


అదే గిన్నెలో తురిమిన బెల్లం వేసుకుని దానిలో కొంచెం నీరు వేయండి. బెల్లం కరిగేవరకు బాగా తిప్పండి. నీటిలో బెల్లం కరిగిపోయిన తర్వాత దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బీట్​రూట్​ మిశ్రమాన్ని వేయాలి. బెల్లం, బీట్​రూట్ మిశ్రమం పూర్తిగా కలిసిన తర్వాత మంటను తగ్గించి.. ఉడకనివ్వండి. ఈ మిశ్రమం కాస్త చిక్కబడినప్పుడు దానిలో ఓ చెంచా నెయ్యి వేసుకోండి. మళ్లీ ఓ 5 నిమిషాలు మంటను సిమ్​లోనే ఉంచి ఉడకనివ్వండి. ఇలా నాలుగు సార్లు నెయ్యి వేస్తూ దానిని తిప్పుతూ ఉండండి. దానిలో జీడిపప్పు, చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలపండి. 


హల్వా మాదిరిగా పిండి చిక్కబడిన తర్వాత స్టౌవ్ ఆపేయండి. సర్వింగ్ బౌల్​కి నెయ్యి రాసి.. దానిలో బీట్​రూట్​ హల్వాను వేయండి. మీరు జీడిపప్పును ముందుగా మిశ్రమంలో వేయొచ్చు లేదా గార్నిష్ చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు. మిశ్రమం చల్లారిన తర్వాత దానిని ఓ ప్లేట్​లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే టేస్టీ, హెల్తీ బీట్​రూట్​ హల్వా రెడీ. దీనిని మీరు పండుగల సమయంలో కూడా చేసుకోవచ్చు. 


Also Read :  జుట్టు లుతుందా? అయితే కొబ్బరి నీళ్లను తలకు ఇలా అప్లై చేయండి