Stock Market Today, 22 February 2024: గ్లోబల్ ట్రెండ్స్‌ ఈ రోజు (గురువారం) సానుకూలంగా ఉన్నాయి. భారతీయ మార్కెట్లు నిన్న హఠాత్తుగా పతనమైనప్పటికీ, యుఎస్‌ మార్కెట్లలోని ఆశావాదం ఈ రోజు ఇండియన్‌ మార్కెట్‌లోనూ ప్రతిబింబించే అవకాశం ఉంది. ఫెడరల్ రిజర్వ్ జనవరి సమావేశం మినిట్స్‌ బుధవారం విడుదలయ్యాయి. వడ్డీ రేట్లను తగ్గించడానికి యూఎస్‌ ఫెడ్‌ తొందరపడడం లేదని అవి సూచిస్తున్నాయి.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 56 పాయింట్లు లేదా 0.25 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,138 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం జపాన్ నికాయ్‌ 1.5 శాతం పెరిగింది, రికార్డు స్థాయికి చేరింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.47 శాతం, ఆస్ట్రేలియా ASX200 0.02 శాతం, హాంగ్‌ కాంగ్‌ హ్యాంగ్ సెంగ్ 0.25 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ 0.44 శాతం లాభపడ్డాయి.


నిన్న వాల్ స్ట్రీట్‌లో చక్కటి సానుకూల సెషన్‌ నడిచింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, S&P500 తలో 0.13 శాతం పెరిగాయి. టెక్-హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ 0.32 శాతం నష్టపోయింది.


US 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్‌ దాదాపు 4.3 శాతం స్థాయిలో ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $83 దగ్గర తిరుగుతోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


రిలయన్స్: దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కాలేజీల కన్సార్టియంతో మొదటి చాట్‌జీపీటీ తరహా సర్వీస్‌ 'హనూమాన్‌'ను RIL మార్చిలో ప్రారంభించనుంది. మంగళవారం, దీనికి సంబంధించిన నమూనా స్నీక్ పీక్‌ను ప్రదర్శించింది.


LTI మైండ్‌ట్రీ: పోలాండ్, యూరప్, భారత్‌లోని ప్రత్యేక తయారీ కేంద్రాలతో పాటు ఏథెన్స్‌లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GenAI), డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి యూరోపియన్ బీమా సంస్థ యూరోలైఫ్ FFHతో MOU కుదుర్చుకుంది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: నిధుల మళ్లింపు ఆరోపణల వ్యవహారంలో సెబీ జారీ చేసిన ఉత్తర్వులపై ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర దాఖలు చేసిన అప్పీల్‌పై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT) ఈ రోజు విచారణ జరుపుతుంది. సోనీ గ్రూప్‌తో $10 బిలియన్ల విలీన ఒప్పందం రద్దు తర్వాత, 2024 జనవరిలో, మ్యూచువల్ ఫండ్స్ జీల్‌లో తమ పెట్టుబడులను 40 శాతం తగ్గించుకున్నాయి. 


యాక్సిస్ బ్యాంక్: గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్, యాక్సిస్ బ్యాంక్ 'Baa3' రేటింగ్‌ను కంటిన్యూ చేసింది. 


NBCC (ఇండియా): సుమారు రూ.10 వేల కోట్ల విలువతో, ఐదు ఆమ్రపాలి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి గ్రేటర్ నోయిడా అథారిటీ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందింది.


మారుతి సుజుకి: దిగుమతి చేసుకున్న విడిభాగాలకు సంబంధించిన తప్పుడు HSN కోడ్‌ కేసులో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మారుతిపై విచారణ ప్రారంభించింది. అలాగే, కొన్ని ఆటోమొబైల్ విడిభాగాలపై  IGST 28 శాతం బదులు 18 శాతం చొప్పున చెల్లించిందన్న కేసులోనూ విచారణ ఉంటుంది.


హీరో మోటోకార్ప్: 2018 నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కంపెనీ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టింది. TVS, బజాజ్, హోండా బలపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ ఆకాశంలోకి పసిడి పరుగు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే